ఇక్కడ వైసీపీలో కింగ్‌లు ఎవ‌రు..!

2019 ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి విస్తరించి ఉన్న గుంటూరు జిల్లా వైసీపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జిల్లా వైసీపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో ? ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహలకు, అంచనాలకు అందడంలేదు. నిన్నటివరకు నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న వారు నేడు ,రేపు మారిపోతున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడుగానూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవుల్లో కొనసాగిన మర్రి రాజశేఖర్ ను అనూహ్యంగా తప్పించి ఆయన స్థానంలో ఎన్నారై మహిళా విడుదల రజనీని చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన సంగతి తెలిసిందే.

రెడ్డి సామాజిక వర్గానికి……

అదే క్రమంలో పెదకూరపాడు వైసీపీ సమన్వయ కర్తగా ఉన్న కావటి మనోహర్ నాయుడుకి కూడా సీటు దక్కుతుందా లేదా అనేది అనుమానంగానే ఉంది. గ‌తంలో క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ వైసీపీలో చేర‌తార‌న్న‌ప్పుడే ఆయ‌న సీటుకు ఎర్త్ ఉంటుంద‌నుకున్నా ఆయ‌న ఎంట్రీ మిస్ అవ్వ‌డంతో కావ‌టి ప్ర‌స్తుతానికి ఊపిరి పీల్చుకున్నా బీ ఫామ్ చేతికి వ‌చ్చే వ‌ర‌కు ఆయ‌న సీటు ఉంటుంద‌న్న గ్యారెంటీ లేదు. గుంటూరు వెస్ట్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపొయిన లేళ్ల అప్పిరెడ్డికి చివర్లో సీటు దక్కుతుందా లేక సామజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఆయనను పక్కనపెడతారా ..? అనే చర్చ కూడా జరుగుతోంది. జిల్లాలో రెడ్డి వ‌ర్గానికి ఇప్ప‌టికే సీట్లు ఎక్కువైన నేప‌థ్యంతో పాటు అప్పిరెడ్డిపై పార్టీలో ఉన్న సందేహాలే ఇందుకు కార‌ణం.

వీరికి వచ్చిన ముప్పేమీ లేదు……

ఇక సీట్లపరంగా చూస్తే.. ప్రత్తిపాడు లో మాజీ ఎమ్యెల్యే మేకతోటి సుచరిత, బాపట్లలో కోన రఘపతి, మాచర్లలో పిన్మెల్లి రామకృష్ణారెడ్డి, నరసారావు పేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాలలో కాసు మహేష్ రెడ్డి, వేమూరులో మేరుగ నాగార్జున, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు , పొన్నూరులో రావి వెంకటరమణ స్థానాలకు వచ్చిన ముప్పేమీ లేదన్నట్టుగా కనిపిస్తోంది. తెనాలిలో అన్నాబత్తుల శివ కుమార్‌ తిరిగి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రేపల్లె లో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అభ్యర్థిగా ఉన్నా.. ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్యెల్యేతోనూ జగన్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇక మంగ‌ళ‌గిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి ఉన్నా ఆయ‌న్ను జిల్లాలో మ‌రో అసెంబ్లీ సీటుకు మారుస్తార‌న్న ప్ర‌చారం ఉన్నా అది వాస్త‌వంలో సాధ్యం అవుతుందా ? అన్న‌ది డౌటే. వినుకొండ‌లో బొల్లానే బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతారు.

వైఎస్ పంథాలోనేనా?

గుంటూరు తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే షేక్ ముస్తఫాను మారుస్తారా లేక కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉండగా … తాడికొండ లో కొత్త అభ్యర్థి రావచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నికల వేళ‌ వైసీపీ పెత్తనమా ఎవరికీ ఇస్తారో అనేది ప్రధాన చర్చ‌నీయాంశంగా మారింది. కీలకమైన గుంటూరు జిల్లాలో రాజకీయ పెత్తనం ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి లేదా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వ్యక్తులకే అప్పగించాల్సి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. సామాజిక వర్గాల ప్రకారం చూస్తే.. టీడీపీ జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి ఓ మంత్రికి ఛాన్స్ ఇస్తోంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం వారు ఆయన కేబినెట్లో మంత్రులుగా కొనసాగారు. వైఎస్ మరణాంతరం కూడా అదే పంథాను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది.

గెలిస్తే వీరికే ఛాన్స్ అట…..

వచ్చే ఎన్నికల నేపథ్యంలో చూస్తే .. ఇప్పటికే మాచర్ల నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి రెడ్డి సామజికవర్గ కోటాలోనూ .. పొన్నూరులో పోటీకి రెడీ అవుతున్న మాజీ ఎమ్యెల్యే రావి వెంకట రమణకు ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత గెలిస్తే ఏర్పడే వైసీపీ ప్రభుత్వంలోనూ మంచి ఛాన్స్ లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాచర్లలో రామకృష్ణారెడ్డి ఇప్పటికే మూడుసార్లు గెలిచి నాలుగోసారి గెలుపుకు రెడీ అవుతుండగా.. గతంలో ప్రత్రిపాడులో గెలిచిన రావి వెంకటరమణ పొన్నూరులో వరుసగా ఐదుసార్లు గెలుస్తూ వస్తున్న ధూళిపాళ్ల నరేంద్రను రావి వెంకటరమణ ఓడిస్తే.. ఏపీలోనే తిరుగులేని జెయింట్ కిల్లర్ గా నిలుస్తాడనడంలో సందేహమే లేదు. ఇక ఎంపీ సీట్ల‌లో గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు పేరు ఖ‌రారు కాగా… బాప‌ట్ల‌లో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వ‌రికూటి అమృత‌పాణి స్థానంలో కేంద్ర స‌ర్వీసుల అధికారుల పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. న‌ర‌సారావుపేట‌లో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పోటీలో ఉంటారా ? లేదా ? అన్న‌ది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*