జగన్ ఇలా డిసైడ్ చేశారట….!

దివంగత మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో కాకలుతీరిన రాజకీయ యోధుడు అయిన నేదురుమిల్లి జనార్థ‌న్‌ రెడ్డి వారసుడు నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైసీపీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఈ నెల 8వ తేదీన ఆయన విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గత కొంత కాలంగా రాజకీయ సందిగ్ధంలో కొట్టు మిట్టాడిన నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డి చివరకు బీజేపీలో తనకు రాష్ట్రస్థాయి పదవి వచ్చిన మరుసటి రోజే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన తన అనుచరులతో సమావేశ‌మై తాను ఏ పార్టీలో చేరేది త్వ‌రలోనే వెల్లడిస్తానని…. వచ్చే ఎన్నికల్లో మీరు అనుకున్న పార్టీ నుంచే పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరతారని వార్తలు బలంగా వినిపించాయి. తాజాగా రామ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన వైసీపీలోకి చేరడానికి నిర్ణయించుకున్నట్టు విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.

పట్టున్న ప్రాంతమైన…….

ఇక రామ్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరడంతో వారి సొంత నిమోజకవర్గమైన వెంకటగిరి పక్కనే ఉన్న గూడూరు నియోజకవర్గాల్లో వైసీపీకి మరింత బలం చేకూరనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న నేదురుమిల్లి కుటుంబ అభిమానులు వైసీపీకి ఎంతైనా ప్ల‌స్ కానున్నారు. ఇక నేదురుమిల్లి వారసుడు వైసీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో ఇప్పటి వరకూ స్త‌బ్దుగా ఉన్న ఆయన వర్గీయుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వాస్తవంగా చూస్తే 1999 2004 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి రామ్‌కుమార్‌రెడ్డి తల్లి మాజీ మంత్రి నేదిరుమిల్లి రాజ్యలక్ష్మి వరస విజయాలు సాధించారు. 2009లో ఆమె టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల‌ రామకృష్ణ చేతిలో ఓడిపోవడంతో ఆ తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా అంత వెలుగులోకి రాలేకపోయింది.

వెంకటగిరి నుంచి కాదట…..

ఇక 1999లో నరసారావుపేట నుంచి ఎంపీగా గెలిచిన జనార్దన రెడ్డి 2004 విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభకు ఎంపికై ఆ పదవిలో ఉండగానే మృతి చెందారు. ఇక చాలా రోజుల తర్వాత నేదురుమిల్లి కుటుంబం జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ పార్టీలో చేరడంతో ఇప్పుడు ఈ వర్గం చాలా రోజుల త‌ర్వాత వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే రామ్‌కుమార్‌ రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. సహజంగానే ఆయన తన సొంత నియోజకవర్గమైన వెంకటగిరి టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే వెంకటగిరి వైసీపీ టికెట్‌ రేసులో ఎక్కువ మంది నేతలు పోటీలో ఉన్నారు.

విశాఖ లోక్ సభ నుంచేనా…?

జ‌డ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన ఆనం తదితరులు రేసులో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌ రెడ్డికి జగన్‌ వెంకటగిరి సీటిపై హామి ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంకటగిరి సీటుపై జగన్‌ ఆనంకు హామి ఇస్తే నేదురుమిల్లి వారసుడిని నెల్లూరు లేదా విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేయించే ఆలోచనలో జగన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. మరి నేదురుమిల్లి ఆయన కోరుకునట్టుగానే వెంకటగిరి లేదా జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీటు ఇస్తారా లేదా నెల్లూరు, విశాఖ లోక్‌సభా సెగ్‌మెంట్లలో ఆయన ఎక్కడో చోట ఎంపీ రేసులో ఉంటారా అన్నది చూడాలి. విశాఖ‌లో రామ్‌కుమార్‌రెడ్డి తండ్రి జ‌నార్థ‌న్‌రెడ్డి ఎంపీగా గెలిచారు. అక్క‌డ కంటే నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తేనే స్థానికంగా వీళ్ల‌కు ప‌ట్టు ఉంటుంది. అయితే ప్ర‌స్తుత సిట్టింగ్ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డిని జ‌గ‌న్ ఎలా స‌ర్దుబాటు చేస్తారో ? కూడా చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*