జగన్ ఆ అభ్యర్థులను ఖరారు చేశారు….!

విప‌క్ష నేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో పాగా వేయాల‌ని చూస్తున్న చంద్రబాబుకు, టీడీపీ నాయ‌కుల‌కు ప‌ప్పులు ఉడికేలా క‌నిపించ‌డం లేదు. చంద్రబాబు ఎన్ని ప్రయ‌త్నాలు చేసినా.. ఇక్కడ సైకిల్ ప‌రుగులు క‌నిపించేలా కూడా లేవు. దీనికి కార‌ణం.. జ‌గ‌న్ దూకుడేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌డ‌ప‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు.. 10 ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ పాగా వేయాల‌ని ప్రయ‌త్నించినా.. టీడీపీ త‌రం కాలేదు. దీంతో ఇక్కడ వైసీపీకే ప్రజ‌లు ప‌ట్టం క‌ట్టారు. ఇంకా చెప్పాలంటే గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ టీడీపీ కేవ‌లం సింగిల్ సీటుకే ప‌రిమిత‌మైంది. 2009 ఎన్నిక‌ల్లో జిల్లాలో ప్రొద్దుటూరు సీటుతో స‌రిపెట్టుకున్న టీడీపీ, గ‌త ఎన్నిక‌ల్లో రాజంపేట సీటును మాత్రమే గెలుచుకుంది.

బాబు ఆశలు గల్లంతే…..

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా ప‌సుపు జెండా ఎగిరేలా చూడాల‌న్న చంద్రబాబు ఆదేశాల‌ను సైతం ప‌ట్టించుకునే వారు ఇక్కడ క‌రువ‌య్యార‌ని అంటున్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచి ఫిరాయించిన వారిపై ప్రజ‌లు తీవ్ర వ్యతిరేక‌త క‌న‌బ‌రుస్తుండ‌డమే..! ఇక‌, క‌డ‌ప‌లో వైసీపీ త‌ర‌ఫున గెలిచి.. పార్టీని న‌మ్ముకుని ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందీ క‌లిగించ‌రాద‌ని జ‌గ‌న్ నిర్ణయించు కున్నారు. సిట్టింగ్‌లకే సీట్లు అంటూ హామీలివ్వడంతో రానున్న ఎన్నికల్లో తామే అభ్యర్థులమని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. దాదాపు వారికే టికెట్లు ఖరారైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సిట్టింగ్ లు అందరికీ……

మైదుకూరులో రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రైల్వేకోడూరులో కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురంలో రవీంద్రనాధరెడ్డి, కడపలో అంజద్‌బాషా, పులివెందులలో వైఎస్‌ జగన్‌లే ఈసారి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక‌, జమ్మలమడుగు నుంచి (ఇక్కడ వైసీపీ జెండాపై గెలిచిన అభ్యర్థి ఆదినారాయ‌ణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు) సుధీర్‌కుమార్‌రెడ్డి, బద్వేలు(ఇక్కడ నుంచి వైసీపీ జెండాపై గెలిచిన అభ్యర్థి జ‌య‌రాములు టీడీపీలోకి ఫిరాయించారు) నుంచి డాక్టర్‌ వెంకట సుబ్బయ్య పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది.

మళ్లీ ఇక్కడ వైసీపీకే…..

రాజంపేట నుంచి మేడా రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డిలు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. దాదాపు మేడా రఘునాథరెడ్డికే టికెట్‌ ఖరారవుతుందని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. ఇలా పది నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారు కావడంతో వారే అభ్యర్థులుగా పోటీ చేస్తారని వైసీపీలోని ఓ ముఖ్య నేత తెలిపారు. ఇక‌, వీరికి స్థానికంగా మంచి ప‌ట్టు ఉండ‌డం.. క‌డ‌ప‌లో టీడీపీ పుంజుకున్న దాఖ‌లాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌డ‌ప‌లో వైసీపీ జెండానే ఎగిరే ఛాన్స్ ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ సింగిల్ సీటుతో స‌రిపెట్టుకున్న టీడీపీ ప‌రిస్థితి… వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అంత గొప్ప‌గా ఉండే ఛాన్సులు అయితే లేవు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*