ఆ విషయంలో జగన్ పక్కాగానే వెళుతున్నారా..?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో జ‌గ‌న్ త‌న వ్యూహాల‌ను అమ‌లు చేసేందుకు రెడీ అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక లు అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకోవ‌డం, పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని భావిస్తున్నా.. జ‌గ‌న్ మాత్రం పూర్తిస్థాయి భ‌రోసా తోనే ఎన్నిక‌ల‌కు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న ప్రస్తుతం సిట్టింగుల్లో చాలా మందికి ఓకే చెప్పనున్నట్టు స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 22 మంది టీడీపీ గూటికి చేరిపోయారు. ఉన్నవారు మొత్తంగా వైసీపీకి అండ‌గా ఉంటున్నారు. ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చినా.. కూడా మిగిలిన వారంతా.. జ‌గ‌న్‌తోనే క‌లిసి ఉన్నారు. పార్టీ కోసం వివిధం రూపాల్లో ఉద్యమాలు సైతం చేస్తున్నారు.

ఈ నెల 11న ప్రకటిస్తారా…?

ఈ నేప‌థ్యంలో అలాంటి వారిలో సిట్టింగులకు టికెట్లు క‌న్ఫర్మ్ చేయాల‌నేది కొన్ని రోజులుగా వినిపిస్తున్న ప్రధాన డిమాండ్‌. అయితే, ఒక‌టి రెండు స్థానాలు మిన‌హా.. జ‌గ‌న్ ఇప్పుడున్న సిట్టింగుల‌కు అవ‌కాశం ఇస్తార‌నే అనుకుంటున్నారు. ఇక‌, ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు జ‌గ‌న్ ఈ నెల 11న ముహూర్తం పెట్టుకున్నారు. ఈనెల 11న విశాఖలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, అభ్యర్థులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఆ తరువాత జిల్లాలో వైసీపీ నేతల దూకుడు పెంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

ఎవరు పోటీ చేస్తారన్నది తేలితే….

జిల్లాలో ఎవరు పోటీ చేస్తారన్నది తేలిపోవడంతో ఇక ఆర్థిక సమస్యలు ఎలా అధిగమించాలన్నది అంతర్గతంగా చర్చ సాగుతోంది. . అక్టోబరుతో జగన్‌ పాదయాత్ర ముగిసిన తరువాత బస్సు యాత్ర ప్రారంభించి జిల్లాల్లో మిగిలిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం పాద‌యాత్ర తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రో కొద్ది రోజుల్లోనే పాద‌యాత్ర ముగిసిన వెంట‌నే మ‌రింత దూకుడుగా జ‌గ‌న్ ముందుకు వెళ్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. ఈ నెల 11న జ‌రిగే స‌ద‌స్సులో జ‌గ‌న్ క్లారిటీ ఇవ్వనున్నార‌ని అంద‌రూ ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*