మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో కీలక నియోజవకర్గం నరసాపురం నుంచి ఆయన గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై నరసాపురం నుంచి గెలుపొందారు ముదునూరి. రాజశేఖర్‌రెడ్డికి ముదునూరు అత్యంత నమ్మకస్తుడు. 2004 ఎన్నికల్లో ముదునూరి నరసాపురంలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా అక్కడ మాత్రం ముదునూరు కాకలు తీరిన రాజకీయ యోధుడు అయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేతిలో కేవలం 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే వైఎస్ మాత్రం ప్రసాద్ నువ్వు ఓడినందుకు బాధపడొద్దు… అక్కడ అంత గట్టి పోటీ ఇచ్చావంటే నువ్వు గెలిచినట్టే అని ప్రసాదరాజు భుజం తట్టారు. ఆ తర్వాత 2009లో వైఎస్ మళ్లీ ఆయనకే సీటు ఇవ్వగా.. ఈ సారి ప్రజారాజ్యం ఎంట్రీతో జరిగిన ముక్కోణపు పోరాటంలో 20 వేల పైచిలుకు ఓట్లతో సుబ్బారాయుడిని ఓడించారు.
జగన్ తో కలిసే…..
అయితే, వైఎస్ మరణం తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైఎస్ జగన్ చెంతకు చేరారు. అప్పటి నుంచి ఆయన జగన్‌తో కలసి ప్రయాణం చేస్తున్నారు. 2012 ఉప ఎన్నికల్లో ప్రసాదరాజు ఓడిపోయారు. గత 2014 ఎన్నికల్లో నరసాపురం నుంచి ప్రయత్నించినా.. జగన్ ఈయనను ఆచంట నుంచి బరిలో నిలిపారు. అయితే, ఇక్కడ నుంచి బరిలో నిలిచిన పితాని సత్యనారాయణపై ముదునూరి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి తనకు నరసాపురంపై పట్టుందని, ఆచంటపై లేదని అప్పట్లోనే జగన్‌కు చెప్పిన ముదునూరి.. అధినేత ఆదేశాల మేరకు ఆచంట నుంచి పోటీ చేశారు. అయినా పితానికి గట్టి పోటీ ఇచ్చారు.
నరసాపురం బాధ్యతలను……
అయితే, ప్రస్తుతం వైసీపీ నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా, నరసాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల్ని ప్రసాదరాజే చూస్తున్నారు. ఆయన తొలిసారి 2004లో పోటీ చేసి ఓటమి చెందారు. 2014లోనూ స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఐదేళ్లు పాటు పని చేయలేకపోయారు. గత ఎన్నికల్లో నరసాపురంలో వైసీపీ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత జగన్ ప్రసాదరాజుకు నరసాపురం బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ప్రసాదరాజు నియోజకవర్గాన్ని చుట్టుముడుతూ పోటీకి సై అంటున్నారు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి జగన్ అంచనాలు మారతాయని, మళ్లీ ప్రసాదరాజుకు వేరే నియోజకవర్గం కట్టబెడతారనే వార్తలు అందుతున్నాయి.
తనకే ఇస్తారని……
అయితే, ఇలాంటి వాటిలో నమ్మకం లేదని, జగన్ ఈ సారి తప్పకుండా తనకు నరసాపురం టికెట్ కేటాయిస్తారని అంటున్నారు ప్రసాదరాజు మరి ఏం జరుగుతుందో చూడాలి. అసలు కథేంటంటే పశ్చిమ గోదావరిలో డెల్టాలో కాపుల ప్రాబల్యం బాగా ఎక్కువ. జగన్ ఇప్పటికే ఆచంటలో మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండిలో సీవీఎల్.నరసింహారాజుకు నియోజకవర్గాల పగ్గాలు ఇచ్చారు. నరసాపురం ఎంపీ సీటు ఎలాగూ రాజులకే ఇవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రసాదరాజుకు సీటు ఇస్తే ఇక్కడే ఏకంగా నాలుగు సీట్లు రాజులకు ఇచ్చినట్లవుతుంది. దీంతో ప్రసాదరాజును పక్కన పెడతారా ? అన్న సందేహాలు వస్తున్నాయి. ఏదేమైనా.. ముదునూరి ఫ్యూచర్ ఏంటనే విషయం ఆసక్తిగా మారింది.