వారు వెళ్లినా జగన్ కు ఇబ్బంది లేదా?

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు.. అనేందుకు ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేనే ఉదాహ‌ర‌ణ‌. స‌రికొత్త రాజ‌కీ యాల‌ను సృష్టిస్తాన‌ని, పార‌ద‌ర్శక రాజ‌కీయాల‌కు వేదిక అవుతాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వాగ్దానాల‌ను, సిద్ధాంతాల ను సైతం ప‌క్కన పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇత‌ర పార్టీల వారిని త‌న పార్టీలోకి చేర్చుకోన‌ని పార్టీ పెట్టిన‌ మొద‌టి నాలుగున్న రేళ్లు భీష్మించుకుని కూర్చుకున్న ఈ యువ నేత‌.. ఇప్పుడు పాత‌వారే దిక్కుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఇత‌ర పార్టీల్లో టికెట్లు ద‌క్కవ‌ని భావించిన వారికి ఇప్పుడు జ‌న‌సేనాని పిల్లనిచ్చి పెళ్లిచేస్తున్న చందంగా మారిపోయారు. వారంద‌రికీ కండువాలు క‌ప్పి.. టికెట్లు సైతం ఇచ్చేందుకురెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆపార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్ర‌తి పార్టీ వారినీ ఆయ‌న అక్కున చేర్చుకుంటున్నారు.

టిక్కెట్లు దక్కవని భావిస్తున్న…….

అయితే, ఇలా చేరుతున్నవారిలో విప‌క్షం వైసీపీ వారి సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ పార్టీలో టికెట్లు దొర‌క‌వ‌ని భావిస్తున్న చోటా మోటా నాయ‌కులు గుండుగుత్తుగా జ‌న‌సేన‌ను ఆప్షన్‌గా ఎంచుకోవ‌డం చ‌ర్చకు దారి తీస్తోంది. అది కూడా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనే కావ‌డం గ‌మ‌నార్హం. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని తూర్పులోకి ప్రవేశించిన వైసీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని బలోపేతం చేద్దామనుకున్నా రు.అయితే, తూర్పుగోదావ‌రి జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి ఎదురైన సెగలు, పవన్ కళ్యాణ్‌నుద్దేశించి జగన్ మాట్లాడిన వ్యాఖ్యలు.. వైసీపీకి కొంత చేటుతెచ్చాయని ఆ పార్టీ వర్గాలే బాహాటంగా చెప్పుకుంటున్నాయి.

ప్రాధాన్యత లేకపోవడంతో……

జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర జరగకముందు నుంచే ముభావంగా ఉన్న ముత్తా కుటుంబం… యాత్ర ముగిసిన వెంటనే అదునుచూసుకుని జనసేనలోకి వెళ్లిపోయింది. అయితే పార్టీలో అంత ప్రాధాన్యత లేకపోవడంతోనే పార్టీ మారారన్న అభిప్రాయమూ కాకినాడ వాసుల్లో ఉంది. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విషయమూ అంతే. ఈ సారి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్న రాపాక వైసీపీతో పాటు టీడీపీని ఆశ్రయించాడు. అయితే ఎవ్వరూ సీటిస్తానని హామీ ఇవ్వకపోవడంతో కొత్తగా వచ్చిన జనసేన ఆసరా అయ్యింది. సీటు హామీ లభించడంతో చటుక్కున కండువా కప్పేసుకున్నాడు. ముమ్మిడివరం బాలకృష్ణదీ అదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌కు సైతం వైసీపీలో సీటు నో ఛాన్స్ అవడంతో జనసేనలో చేరిపోయారు.

పసలేని వారే చేరుతున్నారా?

టి.గ‌న్నవ‌రం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవి సైతం జ‌న‌సేన‌నే ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు వలసలు మరోవైపు అసంతృప్తుల సెగలు వైసీపీని పట్టిపీడిస్తున్నాయి. రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణు విషయంలో ఆ అసంతృప్తి సెగలు బయటపడ్డాయి. పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నా… పరిష్కార మార్గాలపై ఆ పార్టీ దృష్టి సారించకపోవడం మిగిలిన పార్టీలకు కలిసొస్తుందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీకి దూరంగా ఉంటున్న చలమశెట్టి సునీల్ టీడీపీలో చేరడం ఖాయం అయిపోయింది. అక్టోబర్ 2వ తేదీన ముహుర్తం కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇలా జిల్లాలో మూడు పార్టీల మూడు ముక్కలాట అప్పుడే ప్రారంభమైపోయింది. ఏదేమైనా తూర్పు గోదావ‌రిలో వైసీపీ నుంచే పెద్ద ఎత్తున నాయ‌కులు జ‌న‌సేన‌లోకి జంప్ చేసేస్తున్నారు. ఇది ఆ పార్టీపై ఎంతైనా ప్రభావం చూప‌నుంది. అయితే, జ‌న‌సేన‌లోకి చేరుతున్నవారంతా.. ప‌స‌లేని వారేన‌ని, వారికి గెలిచే స‌త్తాలేద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*