సెంట్రలే కాదు…తూర్పు…పశ్చిమ కూడా….?

విజయవాడలో వైసీపీని సమూలంగా ప్రక్షాళన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. పార్టీ పటిష్టత కోసం గత నాలుగేళ్ల నుంచి పనిచేయకుండా ” షో ” చేస్తున్న నేతలను పక్కన పెట్టాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపు, ఓటముల లెక్క ప్రకారమే సీట్లు కేటాయించాలని జగన్ నిర్ణయించారు. సర్వేల ఆధారంగానే ఆయన విజయవాడలోని సీట్ల కేటాయింపు చేస్తున్నట్లు సమాచారం. ఒక్క రాధాయే కాదు మిగిలిర రెండు నియోజకవర్గాల్లోనూ సీట్ల మార్పు తధ్యమంటున్నారు.

పూర్తిగా ప్రక్షాళన చేయాలని……

విజయవాడలో వైసీపీ నాయకత్వాన్ని పూర్తిగా మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియమించినా వంగవీటి రాధా పార్టీకోసం పనిచేసిందేమీ లేదని, ప్రజల్లోకి వెళ్లిందీ లేదన్నది జగన్ కు నివేదికల రూపంలో తేలింది. విజయవాడలో తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి రాధా, పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గానికి యలమంచిలి రవి ఉన్నారు. యలమంచిలి రవి ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరారు.

రవిని తప్పించి……

అయితే రాధా తూర్పు నియోజకవర్గమయితే గెలుపు అవకాశాలుంటాయని సర్వేలో తేలడంతో ఆయనకు తూర్పు నియోజకవర్గాన్ని కేటాయించడానికి జగన్ సిద్ధమయ్యారు. దీనికి రాధా ససేమిరా అంటున్నారు. యలమంచిలి రవి పై గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఆశించినంత లేకపోవడంతో ఆయనను కూడా మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యలమంచిలి రవి స్థానంలో వంగవీటి రాధాను నియమించాలని జగన్ పార్టీ సీనియర్ నేతలను ఆదేశించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ ఈ విషయం ఫోన్లో చెప్పినట్లు తెలుస్తోంది.

వెల్లంపల్లి స్థానంలో……

ఇక పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రస్తుత ఇన్ ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆశించినంత మేర పనిచేయడం లేదని నివేదికలు అందాయి. గతంలో ఈ సీటును వైసీపీ గెలుచుకుంది. జలీల్ ఖాన్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ కు బాధ్యతలను అప్పగించారు. వెల్లంపల్లి వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక్కడ నగరాలు ఎక్కువగా ఉంటారు. వెల్లంపల్లి స్థానంలో నగరా సామాజిక వర్గానికి చెందిన పోతిన ప్రసాద్ కు బాధ్యతలను అప్పగించాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలు ఈసారి జరగకుండా జగన్ ముందుగానే చర్యలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. మరి విజయవాడ వైసీపీలో తలెత్తే అసంతృప్తులను జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*