జగన్ గద్డెనెక్కనివ్వకూడదని….?

రాజ‌కీయాల్లో వ్యూహాలు ప్ర‌తివ్యూహాలు ఎన్ని వేసినా… అంతిమ ల‌క్ష్యం మాత్రం అధికారం అందుకోవ‌డ‌మే..! ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌ల్లోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్‌తో టీడీపీ చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అయింది. అయితే, ఈ విష‌యంలో చంద్ర‌బాబు వ్యూహం చాలా గ‌మ్మ‌త్తుగా ఉంది. ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా తెలంగాణాలో మాత్రం పెట్టుకుంది. నిజానికి తెలంగాణాలో కాంగ్రెస్‌కు ఎవ‌రితోనూ పొత్తు అక్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో 22 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్న కాంగ్రెస్ బ‌లంగానే ఉంది, పైగా నేత‌లంద‌రూ కూడా స‌మ‌ష్టిగా అధికార పార్టీ టీఆర్ ఎస్‌పై యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు.

వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ……

అదేస‌మ‌యంలో తెలంగాణాలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. అక్క‌డ నామ రూపాలు కూడా లేకుండా పోయింది టీడీపీ. ఇప్ప‌టి కేవ‌లం వేళ్ల మీద లెక్కించుకోద‌గిన నాయ‌కులు, ఎలాంటి అవ‌కాశాలు రాని ద‌ద్దోజ‌నం బ్యాచ్ మాత్ర‌మే టీడీపీ లో ఉండిపోయింద‌నే కామెంట్లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణాలో వెంటిలేట‌ర్‌పై ఉన్న టీడీపీకి ఊపిరి అందించేందుకు కాంగ్రెస్ బ‌ల‌మైన పార్టీ అంటూ చంద్ర‌బాబు న‌మ్మారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ వ్య‌తిరేక పునాదుల‌పై ఏర్పాటైన‌ప్ప‌టికీ.. టీడీపీని తీసుకు వెళ్లి కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టించారు. వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే సీట్ల‌పైనా ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. ఓకే తెలంగాణ‌లో ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్న టీడీపీ ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి డిఫ‌రెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

అవసరాల కోసమే…..

ఏపీలో కాంగ్రెస్ నామ‌రూపాలు లేని ప‌రిస్థితిలో ఉంది. కేవ‌లం ఇక్క‌డ వైసీపీ, టీడీపీలు మాత్ర‌మే బ‌లంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో మ‌రి ఏపీలోనూ కాంగ్రెస్‌ను వెంటేసుకుని తిర‌గొచ్చుక‌దా? చ‌ంద్ర‌బాబు! అంటే.. ఇక్క‌డే ఉంది అస‌లు కిటుకు. అలా చేస్తే.. రాష్ట్ర విభ‌జ‌న చేసి, ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో చంద్ర‌బాబు జ‌ట్టు క‌ట్టాడ‌ని జ‌గ‌న్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌డా? ఫ‌లితంగా ఓట్ల చీలిపోవా? అందుకే తెలివిగా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా కాంగ్రెస్‌ను త‌న‌దైన శైలిలో వాడుకుంటున్నాడు. కాంగ్రెస్‌కు బ‌ల‌మున్న చోట దానితో జ‌ట్టుక‌ట్టిన బాబు.. కాంగ్రెస్‌కు బ‌లం లేని చోట పైగా తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీని ఎద‌గ‌నివ్వ‌కుండా త‌న‌దైన చాణిక్యం ప్ర‌ద‌ర్శించి కాంగ్రెస్ నేత‌ల‌ను బాగానే లైన్‌లో పెట్టుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అదే టైంలో కాంగ్రెస్ కూడా తెలంగాణ వ‌ర‌కు త‌మ అవ‌స‌రాల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుని.. ఏపీలో త‌మ‌ను దెబ్బ‌కొట్టిన జ‌గ‌న్‌కు మైన‌స్ అయ్యేలా ఓట్లు చీల్చే క్ర‌మంలో ఒంట‌రి పోరుకు రెడీ అవుతోన్న‌ట్టే క‌నిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*