జగన్ పద్ధతిగానే…లెక్క ప్రకారమే…..!

ఆయన వెళ్లినా పెద్దగా నష్టం లేదని భావించినట్లున్నారు వైసీపీ అధినేత జగన్. నిజానికి కాకినాడ పార్లమెంటుకు బలమైన అభ్యర్థి చలమలశెట్టి సునీల్. అయితే ఆయనను జగన్ కావాలనే దూరం పెట్టారు. చలమలశెట్టి సునీల్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్దికాలం క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడో అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరును తెరపైకి తెచ్చింది. దీంతో సునీల్ టీడీపీ ట్రాప్ లో పడిపోయారు. రాజ్యసభ పదవికి మూడో అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ ఆలోచనను విరమించుకోవడంతో సునీల్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి పోటీ చేయలేకపోయారు.

సునీల్ కే ఇద్దామనుకున్నా……

ఇది వైసీపీ అధినేత జగన్ కు ఆగ్రహం తెప్పించింది. నిజానికి కాకినాడ పార్లమెంటుకు వచ్చే ఎన్నికల్లోనూ చలమలశెట్టి సునీల్ కే ఇవ్వాలని జగన్ భావించారు. చలమల శెట్టి సునీల్ కాకినాడ పార్లమెంటు నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ 34 వేల ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సునీల్ ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో కేవలం 3,400 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అయినా జగన్ ఈసారి టిక్కెట్ ను ఆయనకే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈలోపు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలతో జగన్ సునీల్ ను పక్కన పెట్టారు. పార్టీలో ఉంటూ ఇలా చేయడమేంటని కనీసం జగన్ ఆయన్ను ప్రశ్నించ కుండానే సైడ్ చేసేశారు.

టీడీపీలో చేరేందుకు……

దీంతో చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే చంద్రబాబునాయుడిని కలిసిన చలమలశెట్టి సునీల్ వచ్చే నెలలో పార్టీ చేరేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అనుచరులతో సమావేశమవుతున్నారు. రెండు సార్లు రెండు పార్టీల నుంచి అభ్యర్థిగా బరిలో దిగిన సునీల్ ఈసారి మూడో పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సునీల్ కే ఈసారి కాకినాడ పార్లమెంటు సీటును తెలుగుదేశం పార్టీ ఇచ్చే అవకాశముంది. ఆర్థికంగా, సామాజిక పరంగా సునీల్ బలవంతుడు కావడంతో ఆయనకే ఈసారి టిక్కెట్ అన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.

సునీల్ వర్గం పైనా…..

గత కొన్నాళ్లుగా వైసీపీలో ఉన్న సునీల్ కు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థులు టచ్ లో ఉన్నారు. వారు కూడా సునీల్ వెంట వెళతారన్న అనుమానం వైసీపీలో తలెత్తింది. సునీల్ వర్గం నేతలు కొందరు ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగున్నారు. వారిని తప్పించేందుకు జగన్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గం నుంచి ముత్యాల శ్రీనివాస్ ను తప్పించి ఆయన స్థానంలో జగ్గం పేట కో-ఆర్డినేటర్ గా జ్యోతిబాబును నియమించారు. పెద్దాపురం నియోజకవర్గం ఇన్ ఛార్జి తోట నాయుడిని కూడా తప్పిస్తారని పార్టీలో విన్పిస్తోంది. మొత్తం మీద జగన్ అన్నీ లెక్కలు వేసుకునే పార్టీలో ప్రక్షాళన చేస్తున్నారన్నది వైసీపీలో విన్పిస్తున్న టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*