పొత్తులపై జగన్ చెప్పరే…..?

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానులున్నారు. ఆయనకంటూ ఇక్కడ కొంత ఓటు బ్యాంకు ఉంది. అయినా జగన్ ఇక్కడ దృష్టి పెట్టడం లేదు. దీంతో వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకున్నా జగన్ నుంచి స్పందన లేకపోవడంతో ఇక్కడి వైసీపీ నేతలు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. వైఎస్ జగన్ ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నారు. ఆయన విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. ఆయన తన దృష్టంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే పెట్టారు.

ఎన్నికల వేడితో…..

గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడినా పెద్దగా జగన్ పట్టించుకోలేదు. జగన్ తెలంగాణపై దృష్టిపెడితే అధికారంలోకి వస్తామనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో దెబ్బతింటామని భావించే ఆయన తెలంగాణ రాజకీయాలపై మౌనం వహించారని తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జత కట్టి మహాకూటమి ద్వారా ముందుకు వెళుతుంది. ఇక్కడ కూడా వైసీపీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లోనూ ముగ్గురు ఎమ్మెల్యేలను ఒక పార్లమెంటు సభ్యుడిని తెలంగాణ ప్రజలు గెలిపించారు.

వైఎస్ ఓటు బ్యాంకు……

అయితే ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేస్తున్నప్పుడే తెలంగాణలోనూ జగన్ రాష్ట్ర కమిటీని నియమించారు. రాష్ట్ర కమిటీ కూడా అప్పుడప్పుడు ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి పథకాలకు మంచి స్పందన లభించింది. ఆ ఆదరణ ఇప్పటికీ ఉంది. అందుకోసమే వైసీపీ నేతలు తెలంగాణలోనూ పార్టీని బతికించేందుకు కష్టపడుతున్నారు. మనోనిబ్బరం కోల్పోకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మౌనం వీడుతారని……

కాని తెలంగాణ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ జగన్ మౌనం వీడటం లేదు. జగన్ ఎటువంటి దిశానిర్దేశం ఇక్కడ చేయలేదు. తెలంగాణలో పార్టీకి నాయకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటుందేమోనన్న ఆశ ఆ పార్టీ నేతల్లో ఉంది. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని వైసీపీ తెలంగాణ నేత ఒకరు వాపోయారు. వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించగలదని, పోటీకి సిద్దమని ఇక్కడి నేతలు ప్రకటిస్తున్నా జగన్ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. జగన్ ఆదేశాల కోసం ఇక్కడి నేతలు ఎదురు చూస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి. ఎవరితోనైనా పొత్తుతో ఉంటుందేమోనన్న ఆశతో పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*