జగన్ సిగ్నల్స్ అర్థం కాలేదా….?

వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పార్టీలోకి సంకేతాలు పంపారు. పార్టీలో షో చేసే వారిని ఉపేక్షించబోనన్న సిగ్నల్స్ ఇచ్చారు. వంగవీటి రాధా ఎపిసోడ్ తో వైసీపీలో ఇప్పుడు అంతా సెట్ అయిందంటున్నారు. వచ్చే ఎన్నికలు జగన్ కు అత్యంత కీలకమైనవి. ఈసారి అధికారంలోకి రాకుంటే కష్టాలు తప్పవు. అందుకోసం జగన్ శ్రమకోర్చి లాంగ్ మార్చ్ కు సిద్ధమయ్యారు. గత పదకొండు నెలల నుంచి జగన్ పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రకు మంచి స్పందన రావడం, పార్టీ ప్రకటించిన నవరత్నాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఈసారి గెలుపు ఖాయమని జగన్ భావిస్తున్నారు. స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని భావించిన జగన్ దిద్దుబాటు చర్యలకు దిగిపోయారు.

రాధాను పక్కన పెట్టి……

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఇటీవలే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన జగన్ ఆ మరుసటి రోజునుంచే చర్యలకు దిగారు. జగన్ మొండిగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వంగవీటి రాధాను పక్కనపెట్టడమంటనే సాహసోపతమైన చర్య అని చెప్పక తప్పదు. వంగవీటి రంగాకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన సామాజిక వర్గమే కాకుండా కొన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా రంగాకు వీరాభిమానులే. అలాంటిది ఆయన తనయుడు రాధాను సెంట్రల్ నియోజకవర్గం నుంచి తప్పించేశారు. మల్లాది విష్ణుకు బాధ్యతలను అప్పగించారు.

ఆ కార్యక్రమం ప్రారంభానికి……

అది ఎప్పుడంటే గడపగడపకూ వైసీపీకార్యక్రమాన్ని ప్రారంభానికి ముందురోజే కావడం విశేషం. రాష్ట్రంలోని తన పాదయాత్రలో ఉన్న నియోజకవర్గాలు తప్పించి మిగిలిన 168 నియోజకవర్గాల్లో ఈ నెల 17వ తేదీ నుంచి గడప గడపకూ వైసీపీ కార్యక్రమం ప్రారంభమయింది. జగన్ రావాలి..అన్న కావాలి నినాదంతో ప్రారంభమయిన ఈ కార్యక్రమాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. జగన్ పాదయాత్రతో పార్టీకి హైప్ రావడంతో ఎక్కువ మంది నియోజకవర్గ ఇన్ ఛార్జులు ప్రజల్లోకి తిరగడం మానేశారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు నివేదిక ద్వారా తెప్పించుకుంటున్న జగన్ ఎన్నికల సమయంలో ఇక ఉపేక్షించ కూడదని భావించి రాధాను పక్కన పెట్టడం ద్వారా బలమైన సంకేతాలు పంపారంటున్నారు.

ఆందోళనలో నేతలు……

రాధాపై జగన్ తీసుకున్ని నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు సెట్ అయ్యాయని వైసీపీ నేత ఒకరు చెప్పారు. రాధా లాంటి బలమైన నేతనే జగన్ పక్కన పెడితే ఇక తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన చెందిన నేతలు జనం మధ్యలోకి పరుగులు తీస్తున్నారట. దాదాపు యాభై రోజుల పాటు బూత్ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకున్న నేతలు రాధా ఇష్యూతో అలెర్ట్ అయిపోయి గడపగడపకూ వెళుతున్నారన్నది ఆ పార్టీలోనే విన్పిస్తున్న టాక్. రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ ఛార్జులను మార్చే ఆలోచనలో ఉన్నారట జగన్. దీంతో వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. మొత్తం మీద జగన్ రాధాను పక్కనపెట్టి వైసీపీని రాష్ట్ర వ్యాప్తంగా అలెర్ట్ చేశారన్నది పార్టీలో హాట్ టాపిక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*