జగన్ ఆ డెసిషన్ తీసుకోకుంటే….?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారా? ఈ నిర్ణయం జగన్ కు అనుకూలిస్తుందా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణ శాసనసభ రద్దు కావడంతో అన్ని పార్టీలూ తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ప్రధానంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు కొత్తగా వచ్చిన జనసేన పార్టీ కూడా తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమయింది. ఇక జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ ఎన్నికల్లో పసుపు జెండా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంది.

అన్ని పార్టీలూ ఎన్నికల సమరంలోకి…..

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో సమవేశమై ఆయన పొత్తులపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే మహాకూటమి ద్వారానే ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకోసమే సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో మహాకూటమిని ఏర్పాటు చేసి కేసీఆర్ ను దెబ్బతీయాలన్న వ్యూహంతో చంద్రబాబు ఉన్నారు. గత ఎన్నికల్లో 15 సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా అన్నే సీట్లు సాధించి కీలకంగా మారాలని నిర్ణయించుకుంది.

ఎన్నికలకు దూరంగా……

అయితే ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నట్లుంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలే వచ్చాయి. ఒక ఎంపీసీటును కూడా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీ టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి వై.ఎస్. జగన్ నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ పార్టీకి నేతలు, క్యాడర్ ఉన్నప్పటికీ ఆయన దృష్టంతా ఏపీ రాజకీయాలపైనే ఉంది. అందుకే తెలంగాణను జగన్ దాదాపు పక్కన పెట్టినట్లేనన్నది అందరికీ తెలిసిందే.

పోటీ చేసి వృధాఅంటున్న…….

ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగా జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు జగన్ కు సలహా ఇచ్చారు. అయితే దీనికి ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తెలంగాణలో పోటీ చేయడం వృధాఅన్న నిర్ణయానికి జగన్ దాదాపుగా వచ్చారు. అయితే తెలంగాణకు చెందిన వైసీపీ నేతలు మాత్రం పోటీలో ఉండాల్సిందేనంటున్నారు. దీనిపై జగన్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం పోటీకి ససేమిరా అంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ పాదయాత్రలో ఉన్న జగన్ ఉత్తరాంధ్ర పర్యటన పూర్తి చేయడానికి మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది.అందుకే జగన్ తెలంగాణ ఎన్నికల పట్ల విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ది మంచి నిర్ణయమేనని వైసీపీ సీనియర్ నేతలు అంటున్నారు.