జగన్ స్లోగన్ మార్చారు….!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. మొన్నటి వరకూ అన్న రావాలి అన్న నినాదంతో పల్లె బాట పట్టిన పార్టీ శ్రేణులు ఈనెల 17వ తేదీ నుంచి మరో స్లోగన్ తో ముందుకు వెళ్లనున్నారు. ఈసారి “రావాలి జగన్-కావాలి జగన్” అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రజల్లోకి మరింత చొరవగా వెళ్లేందుకు ఈ నినాదం ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించి జగన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

గత ఎన్నికల్లో…….

గత ఎన్నికల్లో చంద్రబాబు వివిధ స్లోగన్లతో ముందుకు వెళ్లారు. అందులో “జాబు కావాలంటే….బాబు రావాలి” స్టోగన్ గత ఎన్నికల్లో పాపులర్ అయింది. ఈ నినాదంతోనే చంద్రబాబు యువతను ఎక్కువగా ఆకర్షించగలిగారు. అందుకోసమే ఇటీవల వరకూ అన్న రావాలి అన్న నినాదంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తన నినాదాన్ని మార్చుకుంది. ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ పార్టీ నేతలకు సూచించడం విశేషం. ఈ స్లోగన్ తోనే పల్లెలన్నీ పోస్టర్లతో నిండిపోవాలని జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు.

వారికి మినహాయింపు……

ఈ నెల 17వ తేదీ నుంచి పోలింగ్ బూత్ స్థాయిలో గడపగడపకూ వైసీపీ నేతలు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 17న ప్రారంభమై నెల రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమం కేవలం 168 నియోజకవర్గాలకే జగన్ పరిమితం చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర జరుగుతున్నందున దానికి మినహాయింపు నిచ్చారు. ఈ నినాదంతో గడపగడపకూ వెళ్లి పార్టీ రూపొందించిన నవరత్నాలను వివరించడంతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ నేతల అవినీతిని ఎండగట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది.

మొక్కుబడిగా చేస్తే….

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కొందరిని నియమించారు. వాళ్లే దగ్గరుండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. పార్టీ నేతలు మొక్కుబడిగా చేస్తున్నారా? అంకిత భావంతో పనిచేస్తున్నారా? అన్నది వీరే నిర్ణయిస్తారు. పోలింగ్ బూత్ స్థాయి లో జరిగే ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరినీ కలవాలన్నది జగన్ ఆదేశం. చంద్రబాబు వైసీపీపై చేస్తున్న ఆరోపణలు వంటి వాటిపై ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ నేతలు వివరణ ఇవ్వనున్నారు. ఇలా జగన్ తన స్లోగన్ మార్చుకుని ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*