జగన్ ఇలా చేస్తే “పవర్” వస్తుందా?

వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చేందుకు ఇస్తున్న హామీలు లక్షల కోట్లకు దాటుతున్నాయి. పాదయాత్రలో జనస్పందన చూసి జగన్ ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు జగన్ వివిధ పథకాలను ప్రకటిస్తున్నారు. రైతుల దగ్గర నుంచి మహిళ వరకూ, ఎస్సీల నుంచి మైనారిటీల సంక్షేమం వరకూ హామీల వర్షాన్ని కురిపిస్తున్నారు. జగన్ ఇస్తున్న హామీలు లక్షల కోట్లు దాటతాయని ఒకపక్క అధికార తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తున్నప్పటికీ జగన్ మాత్రం తన వరాల వర్షాన్ని ఆపడం లేదు.

అధికారంలోకి రాకుంటే…..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఇప్పటికే పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు దాటిపోయింది. ఎనిమిదేళ్ల నుంచి పార్టీని ఎక్కడా తగ్గకుండా నడుపుకుంటూ వస్తున్నారు జగన్. ముఖ్యంగా నాలుగున్నరేళ్ల నుంచి ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమాన్ని పార్టీ చేపడుతూ ప్రజల ముందుకు వెళుతూనే ఉంది. యువభేరి, దీక్షలు, సదస్సుల పేరిట జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలను చేపట్టింది. ఇక దాదాపు పది నెలల నుంచి జగన్ పాదయాత్రలోనే ఉన్నారు. ఈసారి అధికారంలోకి రాకుంటే పార్టీకి అన్ని రకాలుగా కష్టాలు తప్పవు. అందుకే జగన్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఇచ్చిన హామీతో…..

తాజాగా జగన్ ఇచ్చిన హామీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 45 ఏళ్లు వయస్సు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకాన్ని జగన్ ప్రకటించారు. ఈ పథకంతో 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు వైఎస్సార్ చేయూత పథకం కింద 75 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అణగారిన వర్గాల అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకే ఈ వైఎస్సార్ చేయూత పథకమని జగన్ ప్రకటించారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా 75 వేల రూపాయలను మహిళలకు ఉచితంగా ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. పొదుపుసంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు.

హామీలు, యాత్రపైనే ఆశలు…..

ఇప్పటికే నవరత్నాల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వివిధ హామీలను గుప్పించారు. అలాగే రైతులకు పెట్టుబడి పథకాన్ని కూడా జగన్ ఇదివరకే ప్రకటించారు. పింఛను మొత్తాన్ని పెంచారు. వృద్ధాప్య పింఛను వయసును 45 ఏళ్లకు కుదిస్తామని జగన్ తెలిపారు. ఇలా జగన్ ఇస్తున్న హామీలతో ఈసారి అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. ఒకవైపు పాదయాత్రకు వస్తున్న స్పందన బాగుండటం, మరోవైపు జగన్ హామీలు నేరుగా ప్రజల్లోకి వెళుతుండటం తమకు కలసి వచ్చే అంశంగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ తన పాదయాత్ర పూర్తయ్యేసరికి ఇంకా ఎన్ని హామీలు గుప్పిస్తారో వేచిచూడాలి.

.