అవాక్కయి..అలెర్టయిన జగన్….!

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారు జగన్. పాదయాత్ర పూర్తయిన పది జిల్లాల నుంచి వచ్చిన నివేదికలు జగన్ ను అసంతృప్తికి గురిచేశాయట. వైసీపీ నేతలు ప్రజల్లో తిరగడం మానేసి టిక్కెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉండటాన్ని జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తాను పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళుతుంటే నియోజకవర్గాలను గాలికి వదిలేశారని ఆయన నేతలపై మండిపడుతున్నారు. కేవలం పది నుంచి పదిహేను నియోజకవర్గాలు తప్పించి మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ లీడర్లు సీరియస్ గా వర్క్ చేయడం లేదని గ్రహించిన జగన్ అలర్ట్ అయి కార్యాచరణను సిద్ధం చేశారు.

ఈనెల 10న విశాఖలో……

ఈ నెల 10వ తేదీన విశాఖలో పార్టీనేతల సమావేశం పెట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే జగన్ సీరియస్ వార్నింగ్ ను నేతలకు ఇవ్వడానికి రెడీ అయినట్లు చెబుతున్నారు. నైరాశ్యంలో ఉన్న నేతలు వీలుంటే ఇన్ ఛార్జి నుంచి తప్పుకోవాలని కూడా జగన్ ఈ సమావేశంలో ఘాటుగా చెప్పనున్నారని తెలుస్తోంది. నివేదికలు నేతల పనితీరు చెబుతుంటే అందుకు వివరణ కూడా వారి నుంచి అడగదలచుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

కార్యాచరణ ప్రణాళిక…..

ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేకపోవడంతో ఇకనైనా జాగ్రత్తగా నియజకవర్గంలో పనిచేయాలని ఈ సమావేశం ద్వారా జగన్ తెలపనున్నారు. అంతేకాదు వారికి ఒక క్యాలెండర్ ను కూడా ఇవ్వనున్నారు. ముందుగా వందరోజుల పాటు ఇంటింటికీ వైసీపీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని జగన్ నిర్ణయించారట. ప్రతి ఇంటికీ నేతలు తిరిగి వైసీపీ పార్టీ రూపొందించిన నవరత్నాలతో పాటుగా అధికార పార్టీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ నిర్ణయించారు. మూడు నెలల పాటు ఈ కార్యక్రమం నిరంతరంగా జరగాలని జగన్ భావిస్తున్నారు. తన పాదయాత్ర పూర్తయ్యేసరికి ఇంటింటికీ వైసీపీని కూడా పూర్తి చేసే విధంగా పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది.

భారీ బహిరంగ సభకు……

ఈనెల 9వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర విశాఖ నగరానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా విశాఖలో జగన్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర నుంచి ఈ సభకు జనసమీకరణను చేయనున్నారు. ఈ సభకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ ఛార్జులందరూ హాజరవ్వనున్నారు. సభ ముగినిన మరుసటి రోజు పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పనిలో పనిగా ఆరోజే బూత్ లెవెల్ కమిటీలతో కూడా జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్న జగన్ అవాక్కయి అప్రమత్తమయినట్లే కన్పిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*