ఆ నలభై మీదనే జగన్ బెంగంతా?

వైసీపీ అధినేత జగన్ కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ ప్రశాంత్ కిషోర్ టీం అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలోని దాదాపు 40 నియోజకవర్గాల్లో వైసీపీ బలహీనంగా ఉందని తేలింది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి పోటీ గట్టిగానే ఇస్తుంది.ఈ 135 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని నిలబెడితే విజయావకాశాలున్నట్లు కూడా పీకే టీం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. అందుకు నియోజకవర్గానికి ఇద్దరు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను కూడా జగన్ కు అందించినట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో ఇతర పార్టీల నేతలు కూడా కొందరు ఉండటంతో వారిని పార్టీలోకి రప్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డితో ఒక టీంను ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతలను ఫ్యాన్ పార్టీవైపునకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రత్యేక దృష్టి పెట్టాలని…..

ఇదే సమయంలో ఆ నలభై నియోజకవర్గాల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని జగన్ నేతలకు ఆదేశించారు. ఈ నియోజకవర్గాలు ఎక్కువగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయంటున్నారు. ఈ జిల్లాల బాధ్యులతో జగన్ త్వరలోనే సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈసారి అధికారం ఎట్టిపరిస్థితుల్లో దూరం కాకూడదని భావిస్తున్న జగన్ ఈ మేరకు అభ్యర్థుల వేటలో కూడా పడినట్లు తెలుస్తోంది. నివేదికల ఆధారంగానే కాకుండా, లోకల్ నాయకత్వంతో కూడా జగన్ మాట్లాడుతూ అభ్యర్థుల వివరాలను సేకరిస్తున్నారు.

ఆర్థికంగా బలమైన వారిని….

సామాజక సమీకరణాలతో పాటుగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి ఈ నలభై నియోజకవర్గాల్లో దించాలని జగన్ భావిస్తున్నారు. ఈ నలభై నియోజకవర్గాల్లో దాదాపు పది రిజర్వ్ డ్ స్థానాలు ఉండటంతో వాటి బాధ్యతను పార్లమెంటు సభ్యులకు అప్పగించాలని నిర్ణయించారు. రిజర్వ్ డ్ స్థానాల్లో ఈసారి పార్టీకి నమ్మకంగా ఉండే వారిని ఎంపిక చేయాలని జగన్ ప్రత్యేకంగా సూచించారు. గత ఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన వారిలో ఎక్కువ మంది రిజర్వ్ డ్ స్థానాలకు చెందిన వారు కూడా ఉండటంతో ఈసారి ఆచితూచి ఎంపిక చేయాలని జగన్ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

కొత్త ఫేస్ లకు స్థానం…..

మరోవైపు వీక్ గా ఉన్న నలభై నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో దించడానికి వైద్యులు, ఎన్ఆర్ఐల కోసం జగన్ పార్టీ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గానికి ఇప్పటికే ఒక ఎన్ఆర్ఐని అభ్యర్థిగా ఎంపిక చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోనూ బలంగా ఉన్న తెలుగుదేశం నియోజకవర్గంలో ఇప్పటికే ఒక ఎన్ఆర్ఐ వైసీపీ తరుపున తన పని చేసుకుని వెళుతున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని స్థానాల్లో నియోజకవర్గాల్లో పేరున్న వైద్యులను ఎంపిక చేయాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. కొత్త ముఖాలకు వీటిలో స్థానం కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 14673 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*