జగన్ వెంటే ఉంటారంటారా?

కాపు రిజర్వేషన్ల అంశంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాపుల్లో ఆగ్రహం కల్గిస్తే…..బీసీల్లో మాత్రం స్వాంతన చేకూరుస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని, అందువల్ల దానిపై తాను ఎటువంటి హామీ ఇవ్వలేనని జగన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తర్వాత కాపుల్లో వ్యక్తమయిన ఆగ్రహావేశాలతో జగన్ తిరిగి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. కాపు రిజర్వేషన్లకు వైసీపీ అనుకూలమేనని, బీసీలకు ఎటువంటి అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లు అమలు జరిగేలా కేంద్రంపై వత్తిడి తెస్తామని చెప్పారు.

బీసీల మద్దతు కోసం…..

దీంతో కాపుల్లో ఆగ్రహం కొంతమేర సద్దుమణిగింది. అయితే జగన్ కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయి. జగన్ వ్యాఖ్యలు సరైనవేనని బీసీ సంఘాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీలు తాము చేయలేని పనులు చేస్తామంటూ హామీలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఎదురుదాడిని కూడా ఆయన ఖండించారు.

బాబుపై బీసీల గుర్రు……

రానున్న ఎన్నికల్లో బీసీలు జగన్ పార్టీకి మద్దతుగా నిలుస్తాయని ఆయన ప్రకటించడం విశేషం. జగన్ కూడా తాను తొలుత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ లో తొలినుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతున్నారు. ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి టీడీపీ బీసీల పార్టీగానే కొనసాగుతూ వస్తుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కాపులకు రిజ్వేషన్ల బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపండాన్ని బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అందుకోసమే చేశారా?

తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకు అన్యాయం చేయకుండానే కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతోంది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, బీసీల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. జగన్ వ్యూహాత్మకంగానే కాపుల రిజర్వేషన్ అంశాన్ని మరోసారి ఎత్తి నిప్పు రాజేశారంటున్నారు. దీనివల్ల బీసీల్లో ఐక్యత పెరిగి వచ్చే ఎన్నికల్లో తమకు లాభం చేకూరుతుందనే జగన్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీసీ సంఘాల నేతలు కూడా జగన్ ప్రకటనను స్వాగతిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడినట్లయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*