అవునా…కాదా….జగన్…!

మరోసారి జగన్ ను ఇరుకున పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. ఇప్పటికే జగన్ పార్టీ బీజేపీతో లాలూచీ రాజకీయాలు నడిపిస్తుందని ప్రజల్లోకి పెద్దయెత్తున తీసుకెళ్లగలిగారు. కాపు రిజర్వేషన్ల విషయంలోనూ జగన్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని కూడా చంద్రబాబు ప్రతి సభలో చెప్పుకొస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని, అవగాహన లేనివారు, అవినీతికి పాల్పడే వారు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదని చంద్రబాబు ప్రజలకు నూరిపోస్తున్నారు. తన నాయకత్వంలోనే ఏపీ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని నొక్కి మరీ చెబుతూ వస్తున్నారు.

మరోసారి ఇరకాటంలోకి….

జగన్ మరోసారి ఇరకాటంలోకి చంద్రబాబు నెట్టేస్తున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన కాపు రిజర్వేషన్ల అంశంతో పాటు కేంద్రం ఇచ్చిన హామీల అమలుపైకూడా చర్చ చేపట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయి కాబట్టి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో కూడాచంద్రబాబు ఉన్నారు. కేంద్రంపై కాపు రిజర్వేషన్ల విషయంలో వత్తిడి తెచ్చేందుకు అన్ని పక్షాలను కలుపుకుని పోరాడాలన్నది బాబు వ్యూహంగా ఉంది.

తప్పపడుతున్న పార్టీలు…

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్, కమ్యునిస్టు పార్టీలు, మేధావులు జగన్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. ప్రజా సమస్యలను నిలదీయాల్సిన సమయంలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం తెలివైన పని కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు కూడా చెప్పారు. కాని వైసీపీ అధినేత జగన్ మాత్రం గత రెండు సమావేశాలకు దూరంగా ఉండిపోయారు. తమ పార్టీ నుంచి 23 మందిని కోట్లాది రూపాయలు ఆశచూపి తీసుకున్నారని, వారిలోనలుగురిని మంత్రులుగా కూడాచేశారని, పార్టీని ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడేంత వరకూ తాము అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ అనేక సార్లు చెప్పారు.

కీలకాంశాలతో అజెండా….

అందుకే జగన్ ను ఇరుకున పెట్టేందుకు మరోసారి చంద్రబాబుకు అవకాశం చిక్కిందంటున్నారు. ముఖ్యమైన కాపు రిజర్వేషన్లు, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్,కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటి అంశాలు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశముంది. వీటినే ప్రధానాంశాలుగా అజెండాలో ప్రభుత్వం పెట్టనున్నట్లు తెలిసింది. కీలకాంశాలు చర్చ జరిగేటప్పుడు జగన్ పార్టీ హాజరు కాకపోవడాన్ని ప్రజలు కూడా తప్పపట్టే అవకాశముందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకే ఈ నెల 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలిసింది. మరి ఈసారైనా వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరవుతారా? జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*