జగన్ ను డీఫేమ్ చేయడానికి బాబు….?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి కొత్త ఊపు తెచ్చే కార్యక్రమానికి చంద్రబాబు ప్రారంభించారు. అయితే మరో రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీలోకి సీనియర్ నేతల వలస ఉంటుందంటున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశముంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ ఇంకా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే ప్రజాసంకల్ప పాదయాత్రను చేయాల్సి ఉంది. ఇందుకు మరో రెండు నెలల సమయం ఉంటుంది.

పాదయాత్ర పూర్తయిన తర్వాత……

జగన్ పాదయాత్ర పూర్తికాగానే బస్సు యాత్ర చేపట్టనున్నారు. జగన్ పాదయాత్ర సమయంలో సీనియర్ లీడర్లు చేరేకన్నా, యాత్ర ముగిసిన తర్వాత వారిని పార్టీలోకి చేర్చుకుని పార్టీ గ్రాఫ్ ను పెంచాలన్నది చంద్రబాబు వ్యూహంగా కన్పిస్తోంది. అప్పటికి ఎన్నికలకు ఇంకా సమయం నాలుగైదు నెలలు సమయం మాత్రమే ఉండటంతో సీనియర్ల రాకతో పార్టీకి మంచి హైప్ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు నలుగురైదుగురు సీనియర్ నేతలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉత్తరాంధ్రలో……

ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ నేతలు సబ్బం హరి, కొణతాల రామకృష్ణలను పార్టీలోకి చేర్చుకుని ఆ ప్రాంతంలో మరింత పట్టు సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరిక దాదాపు ఖాయమయిపోయింది. ఈయనకు విశాఖలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం గాని, అనకాపల్లి పార్లమెంటు స్థానంలో గాని పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొణతాల రామకృష్ణ కూడా టీడీపీకి టచ్ లోనే ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. కొణతాల రామకృష్ణ, సబ్బం హరి ఇద్దరూ పట్టున్న నేతలే. ఇద్దరూ వైసీపీలోకొంతకాలం పనిచేసి బయటకు వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిద్దరిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఎన్నికల సమయానికి పార్టీకి మంచి ఊపు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.

రాయలసీమలో…….

అలాగే రాయలసీమలో కూడా చంద్రబాబు ఇలాగే సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకోవాలనుకుంటున్నారు. మాజీ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డిలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. డీఎల్ రవీంద్రారెడ్డికి దాదాపు మైదుకూరు టిక్కెట్ ఖాయమయిందని చెబుతున్నారు. అలాగే మైసూరారెడ్డికి గౌరవమైన పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. ఇలా రెండు నెలల తర్వాత పార్టీలోకి వరుసగా తీసుకుంటే ప్రజల్లో చర్చ జరుగుతుందని, వైసీపీ బలహీనపడుతుందన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. మరి చంద్రబాబు అనుకున్నట్లుగా వారు టీడీపీలో చేరతారా? మరో పార్టీ వైపు చూస్తారా? అన్నది తేలాల్సి ఉంది.