జగన్ కు ఎంత నష్టమో…బాబుకు కూడా?

రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యం గ‌ల, పార్టీల భ‌విష్య‌త్‌ను మార్చేయ గ‌ల‌ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఎలాగైనా పాగా వేయాల‌ని ప్ర‌తిప‌క్ష నేత కంటున్న క‌ల‌లు.. సాధ్యమవుతాయా? ఈసారి ఆయ‌న‌కు గోదారి జిల్లాలు కలసొస్తాయా? నిన్న మొన్న‌టి వ‌ర‌కూ త‌మకు తిరుగులేదు, ఎలాగైనా సీట్లు త‌మ‌వే అన్న ధీమాలో ఉన్న నేత‌ల్లో ఒక్క‌సారిగా ఎందుకు అలజడి ప్రారంభమైంది? . చాప కింద నీరులా వ‌చ్చి.. ఇటు జగన్ కు, అటు చంద్రబాబుకు ముచ్చెమ‌ట‌లు తెప్పిస్తున్నాడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌! అంతేకాదు నిన్న‌టి వ‌ర‌కూ టీడీపీ-వైసీపీ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉంటుంద‌ని, జ‌నసేన మూడో స్థానానికే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని భావించిన నేత‌లు.. ఇప్పుడు తాజా ప‌రిణామాల‌తో వాటిని స‌రిజేస్తున్నారు.

పవన్ రంగంలోకి దిగాక…..

గ‌త ఎన్నిక‌ల్లో అధికారంలోకి రాక‌పోవ‌డానికి ఉభ‌య గోదావ‌రి జిల్లాలే కార‌ణ‌మ‌నే విష‌యం జ‌గ‌న్ ముందే గ్ర‌హించారు. అందుకే ఈ రెండు జిల్లాల‌పై తొలి నుంచి ఎక్కువగా ఫోక‌స్ పెట్టారు. జ‌న‌సేన‌-టీడీపీ మధ్య స‌త్సంబంధాలు ఉన్నంత వ‌ర‌కూ ఒక‌లా ఉన్న రాజ‌కీయ చిత్రం.. ఈ రెండూ విడిపోయాక అనూహ్యంగా మారిపోయింది. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో అత్య‌ధికంగా ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గం.. టీడీపీపై కొంత అసంతృప్తితో ఉంది. ఈ వ‌ర్గాన్ని అక్కున చేర్చుకుంటే ఈసారి ఎన్నిక‌ల్లో పాగా వేయ‌డం సులువు అవుతుంద‌ని జ‌గ‌న్ వ్యూహాలు ప్రారంభించారు. అయితే జ‌న‌సేన.. టీడీపీకి క‌టీఫ్ చెప్ప‌డంతో సీన్ రివ‌ర్స్ అయిపోయింది. త‌మ వైపు వ‌స్తార‌ని భావించిన కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌లు.. జ‌నసేన వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో.. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేనతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే దానిపై అంతర్మథనం చెందుతున్నారు.

వలసలు స్టార్టవ్వడంతో……

ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీ నుంచి జ‌న‌సేన‌లోకి వల‌స‌లు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో జనసేన పార్టీ ఒక కులానికే పరిమితం అవుతుందా? లేక రెండు కులాలకు పరిమితం అవుతుందా? అనే దానిపై ఆ పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. పవన్‌ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏ పార్టీల బలం ఎంత అని.. తమ సన్నిహితుల ద్వారా తెలుసుకుంటున్నారు. కాపు యువత ఎక్కువగా జనసేన వైపు ఉండగా మిగతా వారు టీడీపీ, వైసీపీల వైపు మొగ్గుచూపుతున్నార‌ని తెలుస్తోంది. జగన్‌కు కాపుల్లో కొంత శాతం ఓట్లు లభిస్తాయని ఆ పార్టీ నాయ‌కులు ధీమాగా ఉన్నారు. నిన్నా..మొన్న వైసీపీ, టీడీపీల్లో ఉన్న కాపు యువనాయకులు ఇప్పుడు జనసేనలో చేరిపోయారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఈ ఫిరాయింపులు పెరిగిపోతాయని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గ నేతలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతల్లో ఉత్కంఠత నెలకొంది.

టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆందోళన….

34 నియోజకవర్గాల్లో సగం నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, వైసీపీల మధ్య ప్రధాన పోటీ.. మిగిలిన వాటిలో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు కులపరమైన నేతలతో పాటు..యువతతో పాటు ఇతర సామాజికవర్గానికి చెందిన అభిమానులు జనసేన వైపు మొగ్గుచూపుతున్నారని.. ఆ తరువాత టీడీపీ, వైసీపీ వైపు ఎక్కువగా కనిపిస్తున్నారని చెబుతున్నారు. కాపు ఓటర్లు స్వల్పంగా ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి నేతల్లో ఉత్కంఠత కనిపించడంలేదని, ఆ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట ఎమ్మెల్యేల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందని ఆ సామాజికవర్గ ఓట్లు తమ పార్టీకి పడవని, మిగతా సామాజికవర్గ ఓటర్లను ఎలా ఆకర్షించాలా? అని టీడీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం ఎవరికి ఎడ్జ్‌ ఉందనేది చెప్పలేమని.. మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీకి మొగ్గు కనిపిస్తోందని ఆరు నియోజకవర్గాల్లో జనసేన మెజార్టీలో ఉందని, ఒక‌టి రెండు చో్ట్ల వైసీపీ గెలగలదని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*