
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వానికి రేపే బలపరీక్ష. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం లేకుండానే ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్-జేడీఎస్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఎట్టిపరిస్థితుల్లోనూ బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో కన్నడ నాట మరింత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. బలపరీక్షకు గవర్నర్ వాజూభాయ్ వాలా ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పదిహేను రోజుల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్, జేడీఎస్ నేతలు స్వాగతించారు. బలపరీక్షకు తాము సిద్ధంగా ప్రకటించారు.
ఉత్కంఠ మరికొద్ది గంటలు…..
కాంగ్రెస్-జేడీఎస్ తరుపున అభిషేక్ సింఘ్వి, కపిల్‌సిబల్, చిదంబరం సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. కేంద్రం తరుపున ఏజీ వేణుగోపాల్, యడ్యూరప్ప తరుపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. అయితే బీజేపీ బలనిరూపణకు కొంత సమయం కావాలని కోరగా సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది. అంతేగాకుండా.. సీక్రెట్ బ్యాలట్ పద్ధతిలో బలనిరూపణ నిర్వహించాలని రోహిత్గీ కోరగా దానిని కూడా కోర్టు తిరస్కరించింది. దీంతో కర్ణాటక ఉత్కంఠ పోరులో మరో కీలక మలుపు తిరిగింది.
బలం ఉందంటున్న ఇద్దరూ….
అయితే సుప్రీం కోర్టు తీర్పుతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆనందపడుతుండగా.. బీజేపీ నేతలు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. కర్ణాకట ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇక 78 స్థానాల్లో కాంగ్రెస్, 38 స్థానాల్లో జేడీఎస్, మరో ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు. కర్ణాటకలోని 224 స్థానాలకు గాను 222 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడడంతో మ్యాజిక్ ఫిగర్ 112ను దాటుకుని 117 మంది సభ్యుల బలం ఉంది.
కష్టమేనంటున్న పరిశీలకులు…..
యడ్యూరప్పకు కష్టమేనన్నది పరిశీలకుల భావన. ఆయన ఎక్కువగా లింగాయత్ ఎమ్మెల్యేలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. వారు ఖచ్చితంగా తనకు మద్దతిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అంతేకాకుండా గాలి జనార్థన్ రెడ్డి రాజకీయాలపైన కూడా విశ్వాసంతో ఉన్నారు. మొత్తం మీద యడ్యూరప్పకు అగ్నిపరీక్ష తప్పదంటున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ లు కలసికట్టుగా, ఉండటం కూడా బీజేపీకి కలసి రాదన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. బలపరీక్షకు ఎక్కువ సమయం లేకపోవడం కూడా యడ్యూరప్ప కు మైనస్ గానే భావిస్తున్నారు. బలపరీక్షలో యడ్యూరప్ప నెగ్గితే ఇది ఆయన విజయంగానే భావించాలి. లేకుంటే మూడు రోజుల ముఖ్యమంత్రిగానే యడ్యూరప్ప మిగిలిపోతారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
కాపాడుకునే ప్రయత్నంలోనే…..
కానీ, గవర్నర్ అనూహ్యంగా జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా 104 సీట్లు ఉన్న బీజేపీని ప్రభుత్ ఏర్పాటుకు ఆహ్వానించడం.. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం తెలిసింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రాత్రికిరాత్రి సుమారు 40మంది ఎమ్మెల్యేలను బస్సులు, కార్లలో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ కు తరలించాయి. ఈ హోటల్ యజమాని కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డిది కావడం గమనార్హం. అయితే ముందుగా కేరళలోని కొచ్చికి తరలించాలని భావించినా ఆ తర్వాత అన్నిరకాలు హైదరాబాదే సేఫ్ అంటూ ఇక్కడికి తరలించనట్లు తెలిసింది. అంతేగాకుండా ఏ సమయంలోనైనా మళ్లీ బలనిరూపణ సందర్భంగా తొందరగా రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉంటుందని ఆ పార్టీలు భావించినట్లు తెలిసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు. మరికొద్ది గంటల్లోనే కన్నడనాట బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలో ఎవరిది పైచేయి అనేది తేలనుంది.
Leave a Reply