దాటవేస్తానంటే కుదరదు మరి….!

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కర్ణాటక కమలనాధుల్లో అనైక్యత బయటపడుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సవాల్ గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో అధికారం తృటిలో తప్పిపోయినా, గత శాసనసభ ఎన్నికల్లో అతి పెద్ద మెజారిగా ఆవిర్భవించడంతో లోక్ సభ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. దక్షిణాదిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోగల అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే. అందుకే దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధాని మోదీ కూడా లోక్ సభ ఎన్నికల్లో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు కర్ణాటకలో జరిగే ప్రచారంలో పాల్గొంటారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.

ఈ సమస్యలకు …..?

ఇదిలా ఉంటే పార్టీలో అసమ్మతితో పాటు కొన్ని సమస్యలు బీజేపీకి అడ్డంకిగా మారనున్నాయి. వీటిపై బీజేపీ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొన్నింటికి పరిష్కారం కూడా చూపాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అంతా తానే అయి పార్టీని నడిపిస్తున్నారు. ఉత్తర కర్ణాటక ఉద్యమానికి కూడా రాజకీయ లాభంతోనే వెనకుండి మద్దతిచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉత్తర కర్ణాటక ఉద్యమంపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లింగాయత్ ల సమస్య ఉంది. గత ఎన్నికల సమయంలో లింగాయత్ లను ప్రత్యేక మతంగా మార్చాలంటూ డిమాండ్ వచ్చింది. దీనికి అనుగుణంగానే అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లింగాయత్ లను ప్రత్యేక మతంగా పరిగణించాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఎన్నికల తర్వాత దాని ఊసేలేదు.

లింగాయత్ ల మాటేమిటి?

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి లింగాయత్ ల అంశం తెరమీదకు వచ్చేట్లుంది. ఎన్నికల వరకూ లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించాలని నినదించిన కాంగ్రెస్ కూడా తర్వాత దాన్ని పక్కన పెట్టింది. ఎన్నికలు జరిగి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా దాని ఊసే రాజకీయ పార్టీలు ఎత్తకపోవడంతో మరోసారి దీన్ని ప్రధానాంశంగా మార్చాలని లింగాయత్ లు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం చేతిలో ఈ అంశం ఉంది కనుక వెంటనే ఆమోదించాలన్న డిమాంద్ ను మళ్లీ తెస్తున్నారు. దీనికి మాజీ మంత్రి ఎంబీ పాటిల్ సారథ్యం వహిస్తుండటం విశేషం. దీనినపై బీజేపీపై వత్తిడి పెరిగే అవకాశముంది.

కమలంలో కలహాలు…..

మరోవైపు పార్టీలోనూ లుకలుకలు బయలుదేరాయి. మాజీ ఉపముఖ్యమంత్రి అశోక్ కు ప్రస్తుత కేంద్ర మంత్రి సదానంద గౌడ వర్గానికి పొసగడంలేదు. గత లోక్ సభ ఎన్నికల్లో సదానంద గౌడ బెంగుళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన ఈసారి గెలిచే ఛాన్స్ లేదని అశోక్ వర్గం ప్రచారం చేస్తుందన్నది గౌడ్ వర్గం ఆరోపణ. అందుకే ఇటీవల బెంగుళూరులో జరిగిన పార్టీ సమావేశానికి సదానంద గౌడ గైర్హాజరయ్యారు. కొంతకాలం క్రితం జరిగిన జయనగర్, రాజరాజేశ్వరి నగర్ ఉప ఎన్నికల్లో అశోక్ వైఫల్యం వల్లనే ఓటమి చెందామని గౌడ వర్గం అశోక్ పై ఫిర్యాదు చేసింది. ఇలా లోక్ సభ ఎన్నికల ముందే కమలం పార్టీలో కలహాలు ప్రారంభమయ్యాయి. మరి పార్టీ అధిష్టానం ఈ సమస్యల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*