యడ్డీకి అసలు పరీక్ష ఇదే…!

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బీజేపీ శాస‌న స‌భ ప‌క్ష‌నేత య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. నిన్న య‌డ్యూర‌ప్ప‌ను బీజేపీ శాస‌న స‌భ ప‌క్ష నేత‌గా ఎన్నుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా ఆహ్వానం ప‌లికారు. బ‌ల‌నిరూప‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా ప‌దిహేను రోజుల గ‌డువు ఇచ్చారు. ఈ క్ర‌మంలో గురువారం ఉద‌యం అనేక ఊహాగానాలు, ఉత్కంఠ‌ల న‌డుమ ఆయ‌న ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయినా క‌న్న‌డ‌నాట ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్‌కూ ఎనిమిది సీట్ల దూరంలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌ను ఎక్క‌డి తెస్తార‌న్న‌దానిపైనే తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతోంది. యడ్యూరప్పముఖ్యమంత్రి కాగానే తొలిసంతకం రైతు రుణమాఫీ ఫైలుపై చేశారు. ఆయన ప్రమాణస్వీకారానికి కూడా అన్నదాతను గుర్తుకు తెచ్చే ఆకుపచ్చ కండువా కప్పుకున్నారు.

బీజేపీకి అవకాశమివ్వడంతో….

క‌ర్ణాక‌టలో మొత్తం 224 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ 222 స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి కూడా ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన‌ పూర్తి మెజారిటీ రాలేదు. 104 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజ‌య‌వం సాధించి, అతిపెద్ద పార్టీ అవ‌త‌రించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో విజ‌య‌వం సాధించి, రెండో స్థానంలో, 38 స్థానాల్లో గెలిచి జేడీఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఇక మ‌రో రెండు స్థానాల్లో ఇద్ద‌రు స్వ‌తంత్రులు గెలిచారు. ఇందులో ఒక‌రు బీఎస్పీ అభ్య‌ర్థి. ఇక కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి 116 బ‌లం ఉంది. కానీ, ప్ర‌భుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మికి అవ‌కాశం ఇవ్వ‌కుండా అనూహ్యంగా బీజేపీకే అవ‌కాశం ఇచ్చారు.

ఒకరు బీజేపీకి, మరొకరు కూటమికి….

అయితే ఉన్న ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేల్లో బీఎస్పీ ఎమ్మెల్యే ఇప్ప‌టికే కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చారు. మ‌రొక‌రు బీజేపీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో బ‌ల‌నిరూప‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఎనిమిదిమంది ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీల నుంచే లాగాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిన్న‌జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలోనూ జేడీఎస్ నేత‌లు రేవ‌ణ్ణ‌, కుమార‌స్వామిలు క‌లిసి మాట్లాడారు. తామంతా క‌లిసే ఉన్నామ‌ని రేవ‌ణ్ణ స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ట‌చ్‌లో ఉన్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం నేప‌థ్యంలో ఉత్కంఠ కొన‌సాగుతోంది.

విచారణ రేపటికి వాయిదా….

ఇదిలా ఉండ‌గా… ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని బుధ‌వారం రాత్రి బీజేపీ శాస‌న స‌భ ప‌క్ష నేత య‌డ్యూర‌ప్ప‌కు గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం ప‌ల‌క‌డంపై వెంట‌నే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు అర్ధ‌రాత్రి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించాయి. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంపై స్టే విధించాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. తెల్లవారుజాము వ‌ర‌కూ కొన‌సాగిన వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం చివ‌ర‌కు కీల‌క తీర్పు వెలువ‌రించింది. య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారంపై స్టే విధించ‌లేమ‌ని, గ‌వ‌ర్న‌ర్ అధికారాల‌ను అడ్డుకోలేమ‌ని తీర్పులో పేర్కొంది. అయితే ఈ పిటిష‌న్‌ను కొట్టివేయ‌కుండా మ‌రోమారు వాద‌న‌లు వింటామ‌ని, ప్ర‌మాణ‌స్వీకార అంశం తుదితీర్పున‌కు లోబ‌డి ఉంటుంద‌ని, విచార‌ణ‌కు శుక్ర‌వారం ఉద‌యం 10:30గంట‌ల‌కు వాయిదా వేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*