యడ్డీ…. సర్కార్….నడ్డి విరిచేస్తారా….!

అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది. ఊహించిందే…. ఇదేమీ ఆశ్చర్యం కలిగించకపోయినా…. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంతా భావించారు. కర్ణాటకలో పొలిటికల్ క్రైసిస్ మొదలయింది. సంకీర్ణ సర్కార్ కుప్ప కూలడం ఖాయంగానే కన్పిస్తోంది. కాంగ్రెస్ పెద్దలు చేసిన నిర్లక్ష్యమే సంకీర్ణానికి ముప్పు వాటిల్లుతోందన్న ఆందోళన కుమారస్వామిలో వ్యక్తమవుతోంది. మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ నో చెప్పడం వల్లనే అసమ్మతి నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారంటున్నారు. ఇక కనీసం వారితో చర్చలు జరిపే అవకాశం కూడా లేదన్నది రెండు పార్టీల అగ్రనేతల అభిప్రాయం. బీజేపీ అగ్రనేత యడ్యూరప్ప ఇదంతా ప్లాన్ చేసినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తీరం దాటిందని, తుఫాను ముప్పు సంకీర్ణ సర్కార్ కు పొంచి ఉందంటున్నారు.

బుజ్జగించినా ఫలితం లేదే……

లోక్ సభ ఎన్నికల వరకూ బారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కమల ప్రారంభించదని అందరూ భావించారు. కానీ ఇటీవల హోంమత్రి రాజ్ నాథ్ సింగ్ కర్ణాటక పర్యటన తర్వాత ఆపరేషన్ మరింత వేగంగా సాగిందన్నది జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల ఆరో్పణ. అసలే అరకొర మెజారిటీ, దాన్ని నిలబెట్టుకోవడానికి దాదాపు వంద రోజుల నుంచి దినదిన గండమే. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ప్రధానంగా కాంగ్రెస్ లో అసమ్మతి బయలుదేరింది. ఎప్పటికప్పుడు బుజ్జగిస్తున్నా, అధిష్టానం వద్దకు చేరవేసినా ఫలితం లేదు. సిద్ధరామయ్య రంగంలోకి దిగడంతో కొంత పరిస్థితులు శాంతించినట్లు కన్పించాయి. కానీ మళ్లీ షరా మామూలే. దీంతో అసమ్మతి నేతలు జంప్ చేయడానికే నిర్ణయించుకున్నట్లుంది.

రిసార్ట్స్ కు వెళ్లిపోయిన……

బెళగావి ప్రాంతంలో రమేష్ జార్ఖిహోళి, సతీష్ జార్ఖిహోళితో పాటు దాదాపు 14 మంది ఎమ్మెల్యేలు కర్ణాటక సరిహద్దు దాటిపోయారన్న వార్తలు కాంగ్రెస్, జేడీఎస్ లలో ఆందోళన కల్గిస్తున్నాయి. కుమారస్వామి అనుమానించినట్లుగానే అసంతృప్త ఎమ్మెల్యేలంతా మహారాష్ట్రలోని రిసార్ట్స్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరికి మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత భద్రతను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అసమ్మతి నేతలు తాము పార్టీలో ఉంటామని చెప్పిన గంటల్లోనే సీన్ మారిపోయింది. తర్వాత ఏం జరుగుతుందనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

క్యాంపు నుంచి నేరుగా గవర్నర్ వద్దకు……

కర్ణాటకలో మళ్లీ రిసార్ట్స్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా జార్ఖిహోళి సోదరులతో పాటు ఎమ్మెల్యేలు నాగేంద్ర, సుధాకర్, ఎంబీటీ నాగరాజుల నేతృత్వంలో 14 మంది ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా నేడు గాని రేపుగాని కర్ణాటక గవర్నర్ ను నేరుగా కలసి తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలు ఇస్తారని తెలిసింది. స్పీకర్ కు కూడా తమ రాజీనామా లేఖలను అందజేస్తారని సమాచారం. ఇదే జరిగితే కర్ణాటకలోని జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే. 104 మంది సభ్యులున్న బీజేపీకి అధికారం దక్కే అవకాశముంది. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చన్నది విశ్లేషకుల అంచనా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*