యడ్డీ దుకాణం ఇక బందేనా…??

భారతీయ జనతా పార్టీకి ఆయనకొక్కడే అక్కడ అసలు సిసలైన నాయకుడు. ఆయనే అంతా అయి చూసుకుంటారు. కానీ ఈసారి యడ్యూరప్ప ఫేట్ తిరగబడింది. కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలు కావడం భారతీయ జనతా పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కనీసం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన యడ్యూరప్ప వచ్చే లోక్ సభ ఎన్నికలను ఎలా ఎదుర్కొనగలరన్న ప్రశ్న తలెత్తుతోంది. దక్షిణాదిని భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక మాత్రమే. అందుకే బీజేపీ అగ్రనాయకత్వం ఇక్కడ యడ్యూరప్పకు ఫ్రీహ్యాండ్ ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం మొత్తాన్ని ఆయనే నిర్వహించారు.

బళ్లారిలో ఓటమి….

కర్ణాటకలో జరిగిన మూడు పార్లమెంటు స్థానాల్లో రెండు భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ స్థానాలే కావడం గమనార్హం. శివమొగ్గ, బళ్లారి పార్లమెంటు స్థానాలకు రాజీనామా చేసి అసెంబ్లీకి యడ్యూరప్ప, శ్రీరాములు పోటీ చేయడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే తొలినుంచి శివమొగ్గ స్థానం కొంత బీజేపీకి అనుకూలంగానే ఉంది. యడ్యూరప్ప సొంత నియోజవర్గం కావడం, ఆయన కుమారుడే బరిలో ఉండటంతో విజయం తథ్యమనుకున్నారు. చివరకు ఉత్కంఠ మధ్య బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర గెలుపొందారు. బళ్లారిలో మాత్రం కమలం పార్టీ షో అట్లర్ ప్లాప్ అయింది.

గాలి వ్యాఖ్యలవల్లనేనా?

బళ్లారి పార్లమెంటు నియోజకవర్గం తొలినుంచి బీజేపీకి పట్టుంది. ఇక్కడ గాలి జనార్థన్ రెడ్డి బ్రదర్స్, శ్రీరాములు హవానేకొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థిగా శ్రీరాములు సోదరి శాంతను బరిలోకి దించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉగ్రప్ప పోటీకి దిగారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ తొలినుంచి పోటీ నువ్వా? నేనా? అన్నట్లు సాగింది. అయితే ఎన్నికలకు ముందు గాలి జనార్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజీ చేశాయని, కాంగ్రెస్ కు సానుభూతి పెంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాలి జనార్థన్ రెడ్డి సిద్ధరామయ్య పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. తనను అక్రమకేసుల్లో ఇరికించినందునే ఆ పాపం తగిలి శాపంగా మారి సిద్ధరామయ్యకు పుత్రశోకం మిగిలిందన్న గాలి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇదే ఇక్కడ బీజేపీ ఓటమికి ప్రధాన కారణమని చెబుతున్నారు కొందరు బీజేపీ నేతలు.గాలి వ్యాఖ్యలను యడ్యూరప్ప ఖండించి క్షమాపణ కోరాలని సూచించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సర్ది చెప్పుకుంటున్నా….

ఉప ఎన్నికలు జరిగిన మాండ్య స్థానం అది జేడీఎస్ సిట్టింగ్ స్థానమే. ఇక రామనగర, జమాఖండి అసెంబ్లీ స్థానాలు కూడా వాటి సిట్టింగ్ స్థానాలే. కుమారస్వామి రాజీనామాతో రామనగర, జమఖండి ఎమ్మెల్యే మరణించడంతో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత తాము రాష్ట్రంలో చక్రం తిప్పతామని, సంకీర్ణ సర్కార్ కూలిపోవడం ఖాయమని యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రివర్స్ లో పనిచేశాయి. రామనగరలో అభ్యర్థి ఎంపికపై కూడా అగ్రనాయకత్వం తప్పు పడుతోంది. యడ్యూరప్ప తన చేజేతులా పార్టీని కష్టాల్లోకి నెట్టేశారంటున్నారు. బలం లేకపోయినా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతోనే చేటును తెచ్చిపెట్టిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అయితే బీజేపీ నేతలు మాత్రం ప్రస్తుతం జరిగిన రెండు శాసనసభ స్థానాలు వాస్తవానికి తమవికావని సర్ది చెప్పుకుంటున్నా…యడ్యూరప్ప నాయకత్వంపై కేంద్ర పార్టీకి అనుమానాలు మాత్రం బయలుదేరాయనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*