ఉద్వాసన తప్పేట్లు లేదే…??

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పునరాలోచనలో పడింది. ఏక నాయకత్వం ఉంటే ఎప్పటికైనా వ్యతిరేకత తప్పదన్న నిర్ణయానికి వచ్చింది. ప్రత్యామ్నాయ నేతలను ప్రోత్సహించాలని భావిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో అదే పరిస్థితి ఉంది. ఏక నాయకత్వం వల్లనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతోంది. జాతీయ పార్టీ అయినా బీజేపీలో కొన్ని రాష్ట్రాల్లో ఏకనాయకత్వమే నడుస్తుంది. కర్ణాటక రాష్ట్రాన్ని తీసుకుంటే అక్కడ యడ్యూరప్ప దే రాజ్యం. ఆయన చెప్పిన వారికే టిక్కెట్లు. ఆయనే పార్టీని శాసిస్తారు. యడ్యూరప్పకు మరో ప్రత్యామ్నాయ నేత లేరు. గత అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద పార్టీగా అవతరించినా మ్యాజిక్ ఫిగర్ చేరుకోక పోయినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు యడ్యూరప్ప. తర్వాత ఆయన చేత శాసనసభలో రాజీనామా చేయించాల్సి వచ్చింది కేంద్రనాయకత్వానికి.

ఏకపక్ష నిర్ణయాలే…..

తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో సయితం యడ్యూరప్ప ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది. ఐదు స్థానాల్లో నాలుగింటిలో ఓడిపోయి, తన సొంత నియోజకవర్గమైన శివమొగ్గలో చెమటోడ్చాల్సి వచ్చింది. ఇదంతా యడ్యూరప్ప స్వయంకృతాపరాధమేనంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఇంతే జరుగుతుందని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రామనగర అసెంబ్లీ స్థానంలో అప్పటికప్పుడు చంద్రశేఖర్ ను అభ్యర్థిగా ప్రకటించడం, పోలింగ్ కు ముందే చంద్రశేఖర్ పోటీ నుంచి తప్పుకోవడంతో పార్టీ తలెత్తుకోలేకపోతోంది.

విభేదాల కారణంగానే….

బళ్లారిని పోగొట్టుకోవడం కూడా చేజేతులారా చేసుకున్నారంటున్నారు. ఒకవైపు బళ్లారిలో జనతాదళ్ ఎస్ అధినేతలు దేవెగౌడ, కుమారస్వామి, కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య కలసి ప్రచారం చేసినా బీజేపీలో మాత్రం విభేదాలు కొనసాగడం వల్లనే ఓటమి పాలయ్యారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో ఓటమి పై కేంద్ర నాయకత్వం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఓటమి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని యడ్యూరప్పను కేంద్ర పార్టీ కోరింది. దీంతో ఆయన ఈ నెల 15వ తేదీన ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికలతో పాటు తర్వాత జరిగిన మూడు ఉప ఎన్నికలు, ప్రస్తుతం జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో ఓటమి గల కారణాలేంటో అధిష్టానం తెలుసుకోనుంది.

లోక్ సభ ఎన్నికల అనంతరం…..

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో యడ్యూరప్ప సామర్థ్యం మీద కూడా కేంద్ర నాయకత్వానికి అనుమానాలు బయలుదేరాయి. ఆయన ఈ వయసులో పార్టీని నడిపించగలరా? అన్న సందేహం కలుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా యడ్యూరప్ప కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో వేరే వారిని నియమించాలని అనుకుంటున్నా…అంతటి సామర్థ్యం ఉన్న నేత బీజేపీలో లేరనే చెప్పాలి. అయితే యడ్డీకి ధీటైన నాయకత్వం కోసం మాత్రం అన్వేషించాలన్నది కేంద్ర నాయకత్వం ఆలోచనగా ఉంది. లోక్ సభ ఎన్నికల వరకూ యడ్యూరప్ప రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినా ఆ తర్వాత ఆయనకు ఉద్వాసన తప్పదంటున్నారు. మొత్తం మీద ఏక పక్ష నిర్ణయాలతో యడ్యూరప్ప కర్ణాటకలో కమలం పార్టీ గ్రాఫ్ ను దిగజార్చారన్న వ్యాఖ్యలైతే బాగానే విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*