అంతా యడ్డీ అనుకున్నట్లుగానే….?

అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. వినాయకచవితి పండగ అయిపోయిన వెంటనే ఏక్షణంలోనైనా కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే కనపడుతోంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేతలు వేగంగా పావులు కదుపుతుండగా, హస్తం పార్టీ నేతలు బేజారెత్తిపోతున్నారు. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతున్నారన్న వార్తలు కాంగ్రెస్ నేతలకు కుదురుగా ఉండనివ్వడం లేదు. ఒకవైపు బుజ్జగింపులు, మరోవైపు అసంతృప్తి వాదుల డిమాండ్లను హైకమాండ్ కు చేరవేసే పనిలో ఉన్నారు రాష్ట్ర కాంగ్రెస్ సారథులు. ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్, పీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావులు అదే పనిమీద ఉన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా కుమారస్వామి కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లో అసమ్మతి……

ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు రసకందాయకంలో పడ్డాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే అసంతృప్తి చల్లారుతుందనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానానికి రోజుకోవైపు నుంచి తలనొప్పి బయలుదేరుతూనే ఉంది. బెళగావి జిల్లాలో మొదలయిన ముసలం పార్టీని అధికారంలో నుంచి దించేసే విధంగా తయారైందని చెప్పొచ్చు. దీనికి తోడు అసంతృప్తి వాదులకు కమలం పార్టీ ఎరవేస్తూనే ఉంది. గత వారం రోజుల నుంచి కర్ణాటకలో ఆపరేషన్ కమల ప్రారంభమయిందన్నది టాక్. ఇప్పటికే రమేష్ జార్ఖిహోళి బ్రదర్స్ తో పాటు మరో 11 మంది బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరిలో ఆరుగురికి మంత్రి పదవులు ఇవ్వాలన్న ఒప్పందం కుదిరినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

చర్చోప చర్చలు…..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఇప్పటికే కీలక నేతలతో సమావేశమై పరిస్థితిని కేంద్ర నాయకత్వానికి తెలిపినట్లు సమాచారం. కేంద్ర నాయకత్వం కూడా కుదిరితే కర్ణాటకలో అధికారం దిశగా అడుగులు వేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో శ్రీరాములు, ఉమేష్‌కత్తి, శోభా కరంద్లాజె, బి.వై.విజయేంద్రలతో కలసి యడ్యూరప్ప ఆపరేషన్ ను స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే యడ్యూరప్ప బళ్లారి రూరల్, విజయనగర, కుష్టగి, సండూరు, బసవ కల్యాణ, మస్కి, ముళబాగిల, కాగవాడ, యమకనమరడి, అధణి, లింగసనూరు, గోకాక్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మాట్టాడారని తెలుస్తోంది. వారు చెప్పిన డిమాండ్లకు ఓకే చెప్పడంతో వారు త్వరలోనే బీజేపీలోకి వచ్చేస్తారన్న టాక్ విన్పిస్తోంది.

రాజీనామానా? జంప్ చేస్తారా?

అయితే బీజేపీలో చేరతారా? లేక ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా? అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతం బీజేపీకి కర్ణాటక శాసనసభలో 104 మంది సభ్యులతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా మద్దతిస్తున్నారు. అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఇంకా బీజేపీకి ఎనిమిది మంది సభ్యులు అవసరం. వీరిలో కొందరు రాజీనామా చేసినా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంటుంది. ప్రధానంగా జార్ఖిహోళి బ్రదర్స్ తీసుకునే నిర్ణయం మీదనే సంకీర్ణ సర్కార్ మనుగడ సాధ్యమవుతుందంటున్నారు. వీరితో బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య యూరప్ ట్రిప్ ముగించుకుని వచ్చేలోపే కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కు కాలం చెల్లిపోతుందన్న కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు పరమేశ్వర్, దినేశ్ గుండూరావులు ఏ ఒక్కరూ చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.