యడ్డీ ముహూర్తం పెట్టేశారే…!

అమిత్ షా వేసిన మంత్రమో… అధికారం అందేంత దూరంలో ఉందన్న నమ్మకమో తెలియదు కాని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప మాత్రం ఫుల్లు ఖుషీగా ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి పోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అహ్మదాబాద్ లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో యడ్యూరప్ప భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో అమిత్ షా దిశానిర్దేశం చేశారనితెలుస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధిక స్థానాలను దక్కించుకోవడానికి కృషి చేయాలని అమిత్ షా చెప్పినట్లు యడ్డీ బయటకు వచ్చి మీడియాతో చెప్పారు.

షా తో మంతనాలు తర్వాత…..

లోక్ సభ ఎన్నికలపై సీరియస్ గా దృష్టి పెట్టిన సంగతి వాస్తవమే అయినా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా అమిత్ షా చర్చించినట్ల తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరిన సంగతి తెలిసిందే. బడ్జెట్ అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పెట్టాల్సిందనంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇద్దరూ బహిరంగ మాటల యుద్ధానికి దిగారు. దీంతో కలవరపడి కాంగ్రెస్ సిద్ధరామయ్యను కంట్రోల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయన కూడా సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకాలేదని చెప్పారు.

యడ్డీ నమ్మకం ఏంటంటే…?

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయన్నది ఆయన అంచనా. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే కాంగ్రెస్ నేతలు కుమారస్వామిని గద్దె నుంచి దించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారన్నది ఆయన దగ్గరున్న సమాచారం. ఈ విషయాన్ని ఆయన పార్టీ నేతల ముందే బహిరంగంగా చెప్పడం విశేషం. కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి అనేకమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని, వారిని కలుపుకుని వెళ్లాలని నేతలకు సూచించారు. అంతేకాదు కాంగ్రెస్, జేడీఎస్ నేతల ఇళ్లకు వెళ్లి మరీ ఆహ్వానించమని పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో వ్యాఖ్యానించడం విశేషం.

లోక్ సభ ఎన్నికల తర్వాత తిరిగి….

లోక్ సభ ఎన్నికల తర్వాత కర్ణాటక లో కమలం పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతుందన్నది యడ్డీ మాటలను బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో ఎంబీ పాటిల్ వంటి నేతలు అనేక మంది అసమ్మతితో రగలి పోతున్నారు. అధిష్టానానికి డెడ్ లైన్ కూడా విధించారు. కుమారస్వామి మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి ఉంది. మంత్రి వర్గ విస్తరణ చేసినా, చేయకపోయినా అసమ్మతి, అసంతృప్తి పెరిగే అవకాశముంది. అందువల్ల మరో ఏడాది తర్వాతనైనా బీజేపీ గూటికి కాంగ్రెస్ నేతలు రాకతప్పదన్న అంచనాను యడ్డీ వేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్, జేడీఎస్ లు ఎన్నాళ్లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటారనేదే ప్రశ్న.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*