బళ్లారి తరహా వ్యూహం…భారీ ప్లాన్…!!

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్పను కట్టడి చేయడానికి జనతాదళ్ ఎస్ అగ్రనేతలు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. వచ్చే లోక్ సభ స్థానాల్లో అధిక భాగం కైవసం చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు. యడ్యూరప్పను కట్టడి చేయగలిగితే కర్ణాటకలో మెజారిటీ లోక్ సభ స్థానాలను తిరిగి కైవసం చేసుకోవచ్చన్నది కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల వ్యూహంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో మూడింటిలో రెండింటిని చేజిక్కించుకున్న ఆ పార్టీల్లో జోష్ నెలకొంది. బళ్లారి తరహా వ్యూహాన్ని వచ్చే ఎన్నికల్లో అనుసరించాలని కాంగ్రెస్, జేడీఎస్ లు నిర్ణయించాయి.

బళ్లారిలో ఓడించినట్లుగానే….

పదిహేనేళ్లుగా బళ్లారి భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉంది. అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉగ్రప్ప భారీ మెజారిటీతో విజయం సాధించారు. అందరూ కలసి ఐక్యంగా ప్రచారం చేయడంతో పాటు శివమొగ్గ నియోజకవర్గంపై వత్తిడి పెంచడంతో యడ్యూరప్ప బళ్లారిలో ఎక్కువగా పర్యటించలేకపోయారు. అంతేకాదు బళ్లారిని బీజేపీ నేత శ్రీరాములుకే అప్పగించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిలు బళ్లారిలో విస్తృతంగా కలసి ప్రచారం చేయడమూ ఆ పార్టీకి కలసి వచ్చింది.

ప్రతి నియోజకవర్గానికి…..

దీనికి తోడు బళ్లారి నియోజకవర్గంలో మంత్రి డీకే శివకుమార్ కు బాధ్యతలను అప్పగించడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలపిించారు. అలాగే ఈసారి ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి సీనియర్లను, మంత్రులను బాధ్యులుగా చేసి బళ్లారి తరహా వ్యూహాన్ని అమలు పర్చి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్ లు భావిస్తున్నాయి. అంతేకాకుండా యడ్యూరప్పను శివమొగ్గకే పరిమితం చేయడానికి కూడా వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

యడ్డీని కట్టడి చేసేందుకు…..

శివమొగ్గలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర గెలిచారు. గత ఎన్నికల్లో యడ్యూరప్ప కు లక్షల మెజారిటీ రాగా ఇప్పుడు అది వేలల్లో పడిపోయింది. శివమొగ్గలో ఈసారి కూడా మధు బంగారప్పను పోటీ చేయించి టఫ్ ఫైట్ గా మలిస్తే ఆ నియోజవకర్గానికే యడ్యూరప్పను పరిమితం చేయవచ్చన్నది కాంగ్రెస్, జేడీఎస్ ల ప్లాన్ గా ఉంది. ఇప్పటి నుంచే మధు బంగారప్పను శివమొగ్గ నియోజకవర్గంలో పర్యటించేలా కూడా దేవెగౌడ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మరి వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి ఇదే సీన్ ఉంటుందా? లేక మారుతుందా? అనేది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*