ఆంక్షల్లేవ్….గీంక్షల్లేవ్…..!!

యడ్యూరప్పదీ….గాలిజనార్థన్ రెడ్డిదీ విడదీయలేని సంబంధం. అధిష్టానం ఆంక్షలు విధించినా పెద్దగా పట్టించుకోరు. భవిష్యత్తులో గాలి జనార్థన్ రెడ్డి అవసరం ఉంటుందని భావించిన యడ్యూరప్ప హైకమాండ్ ఆదేశాలను సయితం తూచ్ అంటున్నారు. గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కింగ్ గానే కాదు….అనేక నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లంచం ఇచ్చిన కేసులోనూ గాలి అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్కపెట్టి మరీ బెయిల్ పై బయటకు వచ్చారు.

గాలితో భేటీతో….

అలా గాలి బయటకు వచ్చారో లేదో..వెంటనే కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్పను కలవడం చర్చనీయాంశమైంది. గాలికి, యడ్యూరప్పకు ఉన్న సంబంధం మరోసారి బయటపడింది. అనేక అక్రమ మైనింగ్ కేసుల్లో ఇరుకున్న గాలి జనార్థన్ రెడ్డిని దూరంగా పెట్టాలని బీజేపీ అధిష్టానం భావించింది. ఈ మేరకు ఆదేశాలను సయితం జారీ చేసింది. కొద్ది నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ గాలి జనార్థన్ రెడ్డి పోటీ చేయాలని గట్టిగానే భావించారు. కానీ పార్టీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది.

పక్కన పెట్టినా……

గత శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్థన్ రెడ్డి సోదరుడికి టిక్కెట్ ఇవ్వడం ఆయనకు కొంత ఊరట కల్గించింది. వరుస కేసుల్లో ఇరుక్కుంటున్న గాలి జనార్థన్ రెడ్డిని పార్టీ నేతలు పట్టించుకోవద్దని కూడా చెప్పింది. గాలి వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని పేర్కొంది. జాతీయ స్థాయిలోనూ గాలి అంశం చర్చకు వస్తుండటంతో ఆయనను పక్కనపెట్టాలన్న నిర్ణయాన్ని తుచ తప్పకుండా ప్రతి ఒక్కరూ అమలు చేయాలని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.

వచ్చే ఎన్నికల కోసమేనా?

కాని బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మాత్రం గాలిని వదలడం లేదు. ఆయన ఈడీ కేసులో జైలునుంచి బెయిల్ పై వచ్చిన గాలిని కలవడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గాలి ఉపయోగపడతారనే యడ్యూరప్ప భావిస్తున్నారు. అంతేకాకుండా గాలిపై ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు కూడా గాలిని వెనకేసుకొచ్చేలాగానే ఉన్నాయి. ఆర్థికంగా, ఓట్ల పరంగా తమకు ఇన్నాళ్లూ అండగా ఉన్న గాలిని వదులుకోవడానికి యడ్యూరప్ప ఇష్టపడటం లేదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి ఆయనను వెన్నాడుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గాలి మద్దతు ఉంటేనే కొన్ని స్థానాల్లో గట్టెక్కగలమని బలంగా భావిస్తున్న యడ్యూరప్ప హైకమాండ్ ఆదేశాలను సయితం పక్కన పెట్టేశారు. గాలి మహత్యమంటే అదే మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*