యడ్డీని వదిలిపెట్టరట….!

బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఏం చేయబోతున్నారు? ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రెండు రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన అభిమాని చెన్న బసవప్ప గుండెపోటుతో మరణించారు. దీంతో యడ్యూరప్ప ట్వీట్ చేశారు. ముందు ముందు బీజేపీకి మంచి రోజులున్నాయని, అధైర్యపడవద్దని ఆయన కార్యకర్తలకు, నేతలకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

నిరాశలో కమలనాధులు….

అయితే బీజేపీ నేతలకు మాత్రం అంది వచ్చిన అవకాశం చేజారి పోయిందన్న నిరాశలో ఉన్నారు. కర్ణాటకలో 104 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ తక్కువ స్థానాలు సాధించిన పార్టీలు మిలాఖత్ అయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. గెలిచిన 104 మంది ఎమ్మెల్యేలతో పాటు ఓటమి పాలయిన బీజేపీ అభ్యర్థులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో యడ్యూరప్ప మళ్లీ ఒకసారి రాష్ట్ర పర్యటన చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయిన నియోజకర్గాలను తొలుత పర్యటించాలని భావిస్తున్నారు.

యడ్డీ పర్యటలు షురూ…..

ఆ నియోజకవర్గాల్లో ఓటమికి గల కారణాలు, అందుకు దారితీసిన పరిస్థితులను యడ్యూరప్ప తెలుసుకోనున్నారు. అయితే యడ్యూరప్ప మాత్రం తన సన్నిహితుల వద్ద పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులు మనవేనన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆరునెలల పాటు ప్రజల మధ్యనే ఉండాలని యడ్యూరప్ప నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడి ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెబుతున్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మొన్న జరిగిన ఎన్నికల్లో తప్పొప్పులను సమీక్షించుకోవాలని భావిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికలపై దృష్టి……

కాంగ్రెస్, జేడీఎస్ కలయిక ఎక్కువ కాలం కొనసాగదన్న ధీమాలో కమలనాధులున్నారు. ముందుగా వచ్చే మూడు ఉప ఎన్నికలు, లోక్ సభ స్థానాలపై దృష్టిపెట్టాలని ఇప్పటికే యడ్యూరప్పకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. యడ్యూరప్ప సారథ్యంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లనున్నట్లు కూడా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కన్నడ కమలం పార్టీ నేతలకు చెప్పింది. అమిత్ షా కూడా యడ్యూరప్ప నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంచారంటున్నారు. మరి కన్నడనాట వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*