తునిలో తిరుగుబాటు..? పేల‌నున్న డైన‌మైట్‌..!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ప‌రిస్థితులు ఎప్పుడు ఎలా మార‌తాయో కూడా చెప్ప‌లేని ప‌రిస్థి తి! ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే.. తూర్పుగోదావ‌రి జిల్లా టీడీపీలో ఏర్ప‌డింది. ఇక్క‌డి తుని నియోజ‌క‌వ‌ర్గం ఆర్థిక మంత్రి, చంద్ర‌బాబుకు అన్ని విధాలా రైట్ హ్యాండ్ అయిన య‌న‌మ‌ల రామకృష్ణుడుది! 1983 నుంచి 2004 ఎన్నిక‌ల‌వ‌ర‌కు కూడా ఆయ‌న ఇక్క‌డ అప్ర‌తిహ‌తంగా విజ‌యం సాధిస్తూనే ఉన్నారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. అయితే, ప‌రిస్థితులు అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు అన్న‌ట్టు ఆ త‌ర్వాత ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. ఈ దెబ్బ నిజానికి పార్టీ ప‌రంగా టీడీపీకి ఇబ్బంది క‌లిగించినా.. నైతికంగా య‌న‌మ‌ల హ‌వాకు తీర‌ని దెబ్బ‌కొట్టింది.

గత ఎన్నికల్లోనూ…..

ఇక‌, 2014 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ టీడీపీ టికెట్‌ను య‌న‌మ‌ల సోద‌రుడు య‌న‌మ‌ల కృష్ణుడు ఉర‌ఫ్ ప‌ళ్ల కృష్ణుడు కు ఇచ్చారు. అయితే, ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయారు. దాదాపు 20 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో వైసీపీ అభ్య‌ర్ధి దాడిశెట్టి రామ‌లింగేశ్వ‌ర‌రావు, ఉర‌ఫ్ దాడిశెట్టి రాజా విజ‌యం సాధించారు. దీంతో మ‌రోసారి య‌న‌మ‌ల ఫ్యామిలీకి ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్ట‌యింది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ కృష్ణుడుకే టికెట్ ఇవ్వాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యిం చారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆయ‌న టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని కూడా అంటున్నారు. ఇదే ఇప్పుడు ఇక్క‌డ పార్టీలో ముస‌లం పుట్టిస్తోంది. య‌న‌మ‌ల ఫ్యామిలీలో మ‌రెవ‌రికైనా టికెట్ ఇవ్వండికానీ, ప‌ళ్ల కృష్ణుడు కు మాత్రం వ‌ద్ద‌ని ఇక్క‌డి పార్టీ నాయ‌కులు అంటున్నారు.

పెత్తనం సహించలేకనే……

ఈ విష‌యం.. గ‌త ఏడాది నుంచి వినిపిస్తున్నా.. ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా ఈ డిమాండ్ వినిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప‌ళ్ల కృష్ణుడు విజ‌యం సాధించ‌కుండానే త‌మ‌పై పెత్త‌నం చేస్తున్నాడ‌ని, ఎవ‌రినీ లెక్క చేయ‌డం లేద‌ని, త‌న సొంత నిర్న‌యాల‌ను అమ‌లు చేస్తున్నాడ‌ని, అన్న అదికారం(ఆర్థిక మంత్రిగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఉన్నారు) అడ్డు పెట్టుకుని అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా ఇక్క‌డి నాయ‌కులు విమ‌ర్శ‌లు ఎక్కు పెడుతున్నారు. అంతేకాదు, కొంద‌రు లోపాయికారీగా ప‌త్రిక‌ల‌కు లీకులు కూడా అందిస్తున్నారు.

ఓడిపోయినా…….

అస‌లు స్టేట్‌లోనే ఎక్క‌డా లేని విధంగా ఇక్క‌డ కృష్ణుడు ఓడిపోయినా ఆయ‌న‌కు ఏఎంసీ చైర్మ‌న్ ఇచ్చారు. ఇది కూడా సొంత పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మైంది. ఇక ఇప్పుడు టోట‌ల్‌గా య‌న‌మ‌ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ తీరు, ప‌ద‌వులు అన్నీ వాళ్ల‌కేనా ? అన్న‌ది నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో బ‌లంగా నాటుకుపోయింది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈ ప‌రిణామం పార్టీని తీవ్రంగా డిఫెన్స్‌లో ప‌డేసింది. గ‌త ఎన్నిక‌ల్లోనూ ప‌రాజ‌యం పాలైన ప‌ళ్ల కృష్ణుడుకు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే బెటర్ అని అంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*