వైసిపి, జనసేనకు ఖుషి… ఉండవల్లి గొంతు విప్పారుగా ..!

చాలా కాలం తరువాత మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అమరావతిలో రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటి తరువాత ఉండవల్లి సైలెంట్ ఎందుకు అయ్యారన్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. అమరావతి రాజధాని కోసం బాండ్లపై అధిక వడ్డీ చెల్లించేలా బాండ్లు విడుదల చేయడం దారుణమని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2వేల కోట్ల అప్పుకు ప్రతి మూడు నెలలకు 10.36 శాతం అధిక వడ్డీ చెల్లించాల్సి ఉందని, పైగా అమరావతి బాండ్లలో బ్రోకర్‌కు రూ.17 కోట్లు ఇవ్వడం మరీ విడ్డూరమని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చెబుతున్న పారదర్శకత ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఇక ఈ బాండ్లు కొన్న 9 మంది పేర్లు ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అధిక వడ్డీకి అప్పులు తీసుకోవద్దంటూ 7 నెలల క్రితమే జీవో జారీ చేశారని, అయితే ఇప్పుడు అధిక వడ్డీకి బాండ్లు జారీ చేయడం శోచనీయమన్నారు. అసలు సీఆర్డీఏ మీద నమ్మకం పోయిందన్నారు. గతంలో మర్చంట్ బ్యాంకుగా వుండడానికి కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకుంటామని ఏకే కేపిటల్ పేరుతో ముందుకు వచ్చిన వ్యక్తికే ఇప్పుడు 17కోట్లు బ్రోకరేజి ఇవ్వడంలో అంత్యర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో విజన్ 2020 రూపొందించిన చంద్రబాబు సలహాదారు పాస్కల్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ జైలులో ఉన్నారని ఈ సందర్భంగా ఉండవల్లి చెబుతూ దీన్ని బట్టి సలహాదారులు ఎలాంటి వాళ్లు ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు. అధిక వడ్డీ చెల్లిస్తూ అది కూడా మూడు నెలలకొకసారి వడ్డీ చెల్లించేలా చేయడం,17కోట్లు బ్రోకర్ కి చెల్లించడం దారుణమని ఆయన పేర్కొంటూ దీన్ని కూడా పెద్ద ఘనతగా చెప్పుకోవడం శోచనీయమన్నారు.

మందుబాబులు సమ్మె చేస్తే ఇక అంతే సంగతులు

ఆదాయం పెరిగి, వ్యయం తగ్గితే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినట్లు అవుతుందని, ధనవంతులు, పేదల మధ్య అంతరం తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరించాలే తప్ప వ్యాపారం చేయడం కాదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. రాజధాని కట్టేస్తే ఏదో జరిగిపోతుందన్న భ్రమ నుంచి బయటకు రావాలన్నారు. ఈ సందర్బంగా లిక్కర్ ద్వారా వస్తున్న ఆదాయం గురించి ఆయన వివరిస్తూ, 180 ఎంఎల్ చీప్ లిక్కర్ ధర 50 రూపాయలుగా అమ్ముతున్నారని, అయితే దీని తయారు, ప్యాకింగ్ , షాప్ కి చేర్చడానికి అన్ని ఖర్చులు కలిపి ఎనిమిదిన్నర రూపాయలు మాత్రమే అవుతోందని,ఇక షాపు నిర్వహించే వాళ్లకు మూడు రూపాయల 75పైసలు వస్తుందని, మిగిలిన సొమ్ము అంటే 37రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుందని విశ్లేషించారు. రోజుకి 24గంటలూ షాపులు తెరిపించి, ముందుకు బానిసలుగా చేసి, ఇంత దారుణంగా పేదల నుంచి డబ్బు రాబట్టుకోవడం దారుణమని ఆయన అన్నారు. వారం రోజులు మందుబాబులు సమ్మె చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పడిపోయి నడవడమే కష్టం అవుతుందని ఉండవల్లి చమత్కరించారు.

పెట్రోలు మీద సైతం…

ఇక పెట్రోలు విషయానికి వస్తే ప్రస్తుతం రాజమండ్రిలో లీటరు పెట్రోలు 85 రూపాయలు ఉందని, ఇందులో 32 రూపాయలు సేల్స్ టాక్స్ కింద రాష్ట్రానికి, ఎక్సయిజ్ కింద కేంద్రానికి 19రూపాయలు వెళ్తాయని ఉండవల్లి వివరిస్తూ బిల్లులో ఈ వివరాలు పొందు పరచాలని సూచించారు. కేరళలో ఇలాగే పొందుపరుస్తారని చెప్పారు. నిజాలు చెప్పి పాలన చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గల అప్పు రెండు లక్షల 25వేల 234కోట్లలో, ఈ నాలుగేళ్లలో తీసుకున్న అప్పు రూ.1.30లక్షల కోట్ల వరకూ ఉందన్న ఆయన ఈ అప్పును ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు.

వాస్తవాలను వివరిస్తూ చైతన్యం కల్పించాలి …

చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలని, మార్పు తేవాలని ఉవ్విళూరుతున్నారని, అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యం కాదన్నారు. ప్రజల్లో వాస్తవ పరిస్థితులపై చైతన్యం కల్పించడం ద్వారా మార్పుకి మార్గం వేయాలన్నారు. జగన్ అధికారంలోకి వస్తే అవినీతి ఉండదని చెబుతుంటే, తాను అవినీతిపైనే పోరాటమని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఇక తమది పారదర్శకమని చంద్రబాబు అంటున్నారని, కానీ, డబ్బులిచ్చి ఓటు వేయించుకుని వ్యాపారానికి విరుద్ధంగా తాము వ్యవహరిస్తామని ప్రకటించాలని ఆయన సూచించారు. డబ్బు ఇస్తే, తీసుకున్న పేదవాడు మోసం చేయలేక వాళ్లకే ఓటు వేస్తున్నాడని ఇందులో పేదవాళ్ల తప్పు లేదని, మార్పు రావాలని ఆయన అన్నారు. 20 కోట్లు ఖర్చుచేసి, ఎమ్మెల్యే అయితే వ్యాపారం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*