మైలేజీలో దూసుకుపోతున్న వైసీపీ

మైలేజ్ మైలేజ్ మైలేజ్ …. ఇదే ఇప్పుడు అన్ని పార్టీల తారక మంత్రం. ఏపీకి హోదా విభజన హామీలు కోసం పోరాటంలో ఎవరు ముందు వున్నారు? ప్రజల్లో ప్రస్తుతం ఏ పార్టీ లీడింగ్ లో వుంది అనే అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకుంటూ ప్రాంతీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం హోదా పోరాటంలో లీడింగ్ లో వైసిపి దూసుకుపోతుంది. ఆ పార్టీ తొలినుంచి ఒకే స్టాండ్ పై వుంది. అంతే కాదు దశలవారీ కార్యాచరణ ప్రకటించింది. అవిశ్వాసానికి తొలి గా స్పందించడం. దానికోసం ప్రయత్నం చేయడం. ఆ తరువాత రాజీనామాలు, ఆ తరువాత ఆమరణ దీక్ష . ఇలా ఒక పద్ధతి ప్రకారం వైసిపి ముందుకు సాగింది.

ఓవర్ టేక్ చేసేందుకు టిడిపి …

విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశంలో టిడిపి ముందు నుంచి పల్టీలు కొడుతూనే వుంది. బిజెపి తో నాలుగేళ్ల దోస్తానా ఆ పార్టీ కొంప ముంచింది. నాలుగేళ్ళు బిజెపి తో యుగళ గీతం పాడి బాబు, వెంకయ్య ప్యాకేజి సన్మానాలు కూడా భారీ ఎత్తున చేయించుకోవడం చేటు తెచ్చింది. నాలుగేళ్ళు తరువాత టిడిపి కి షాక్ ఇచ్చింది మాత్రం జనసేన పవన్ కళ్యాణ్. గుంటూరు సభలో పవన్ టిడిపి పై నిప్పులు ఎప్పుడైతే చెలరేగారో సైకిల్ పార్టీకి తాము అడ్డంగా బుక్ అయ్యామని తెలిసిపోయింది. తమ వెంట భవిష్యత్తులో బిజెపి, జనసేన వెంట రాదని తేలిపోవడంతో ఇక మౌనం వహిస్తే మొదటికే మోసం వస్తుందని యు టర్న్ తీసుకుంది. ముందు రెండు కేంద్రమంత్రులు వదులుకుంది. ఆ తరువాత అన్ని వైపులా వత్తిడి మరింత పెరగడంతో ఎన్డీయే నుంచి పూర్తిగా బయటకు వచ్చింది. వైసిపి అవిశ్వాసం పెట్టిందని టిడిపి ఆ ప్రయత్నం మొదలు పెట్టింది. పార్లమెంట్ లోపలా, బయట ఉద్యమం మొదలు పెట్టింది. సెషన్స్ అయిపోయాక తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు విమానం ఎక్కేద్దామని బయల్దేరిన ఎంపీలకు ఆగండి అంటూ పార్టీ నుంచి ఆదేశాలు అందాయి. వైసిపి ఆమరణ దీక్ష కు కౌంటర్ గా రోజు ఏదొక ఆందోళన చేయాలన్న ఆదేశాలతో ఎంపీ తమ్ముళ్ళు ఢిల్లీ వీధుల్లో హల్ చల్ చేస్తున్నారు. ఇలా తమ పార్టీకి మైలేజ్ కోసం వారు చేయని ప్రయత్నం లేదు.

గేమ్ ఛేంజర్ జనసేన ….

ఈ మొత్తం పొలిటికల్ గేమ్ లో ఆట మార్చింది మాత్రం జనసేన. టిడిపి ఆశలపై నీళ్ళు పోసేయడంతో ఎపి రాజకీయాలే మారిపోయాయి. జనసేన అధినేత పార్ట్ టైం పొలిటీషియన్ అన్న విమర్శలు తుడిచేసుకుని ప్రయత్నాల్లో పడ్డారు. సిపిఐ, సిపిఎం లతో కలిసి సుదీర్ఘ పోరాటానికి దిగి ఆయన పార్టీ మైలేజ్ సాధించే పనిలో పడ్డారు. జనసేన దూకుడుతో వైసిపి, టిడిపి లు తమ క్రెడిట్ కోసం చేయని పోరాటం లేదన్నట్లు సాగిపోతున్నారు. అందరికి ఇప్పుడు విలన్ బిజెపి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు సాగిస్తున్నా నామమాత్ర ఐడెంటిటీ మాత్రమే పొందగలుగుతుంది. మొత్తం మీద వైసీపీకే మైలేజీ వచ్చిందని సర్వేలు తేల్చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*