జగన్ మరో డెసిషన్…కేక పుట్టిస్తుందా?

‘‘వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించడం లేదు. వైసీపీ గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల్లో ప్రభుత్వం పనులు చేపట్టడం లేదు. అక్కడ తెలుగేదేశం పార్టీ ఇన్ ఛార్జులే అనధికారికంగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నారు.’’ అంటూ వైసీపీ అధినేత జగన్ మరో అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకుని దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో జగన్ విజయం సాధించినట్లే. అధికార టీడీపీ, మరో పార్టీ జనసేన కేంటే ఈ విషయంలో జగన్ ముందున్నారన్నది జనం మాట.

పార్లమెంటు సభ్యుల రాజీనామాతో….

అయితే ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఈరోజు వైసీపీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయబోతున్నారు. సభ వాయిదా పడిన వెంటనే ఎంపీల రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటారు. వారికి సంఘీభావంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో ఒక రోజు దీక్ష చేయనున్నారు. ఇక్కడ నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలకు దిగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాను ఉధృతంగా తీసుకెళుతూనే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విరుచుకు పడేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేలు సయితం…..

ప్రత్యేక హోదా సాధన కోసం, మరోవైపు టీడీపీ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా వైసీపీ గెలిచిన నియోజకవర్గాలను అన్యాయం చేస్తుందని పేర్కొంటూ ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయించాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. వైసీపీకి ప్రస్తుతం 47 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరంతా జగన్ మాటకు కట్టుబడి ఉండేవారే. దాదాపు 23 మంది పార్టీని వీడి వెళ్లిపోయినా వీరు మాత్రం జగన్ ను అంటిపెట్టుకునే ఉన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధులు కేటాయించక పోవడం, టీడీపీ నేతల పెత్తనం చేస్తుండటంతో ఈ నాలుగేళ్లు వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెద్దగా పనులు చేయించలేక పోయారు.

పొలిటికల్ హీట్ పెంచడానికేనా?

వచ్చే ఎన్నికల్లో వీరిపై అసంతృప్తి పడకుండా రాజీనామాలు చేయించి తాము ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందో నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగి చెప్పించాలన్నది జగన్ వ్యూహంగా ఉంది. చంద్రబాబు తమకు నిధులు కేటాయించలేదని, ప్రతిపక్ష పార్టీకి చెందిన నియోజకవర్గాలను పక్కన పెట్టేసిన బాబు కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు కేటాయించారని, దీంతో తాము అభివృద్ధి చేయలేకపోయామని వివరించనున్నారు. దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశముంది. అభివృద్ధి చేయనందునే తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని కూడా వారు ప్రజలకు చెప్పనున్నారు. రాజ్యసభ ఎన్నికలు కూడా పూర్తవడంతో ఎమ్మెల్యేల చేత కూడా రిజైన్ చేయించి అధికార పార్టీపై మరింత వత్తిడి తేవాలన్నది జగన్ ప్లాన్ గా వైసీపీనేతలు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడుతుందని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. రాజీనామాలు చేసేందుకు ఎమ్మెల్యేలు కూడా సై అంటున్నారని చెప్పారు. మొత్తం మీద జగన్ ఒకదాని వెంట ఒకటి నిర్ణయాలు తీసుకుంటూ అధికార టీడీపీని డైలామాలో పడేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*