ఆ సీటులో వైసీపీకి అభ్యర్థి దొరికేశారా..?

andhra Pradesh elections 2019 telugu post telugu news

వైసీపీకి శ్రీకాకుళంలో పట్టుంది కానీ, సరైన అభ్యర్ధులు లేక గత ఎన్నికల్లో చాలా చోట్ల ఓటమి పాలయ్యింది. ముఖ్యంగా పార్లమెంట్ సీటు విషయానికి వస్తే ఆ పార్టీలో బలమైన నేతలు కనిపించడం లేదు. ఉన్న వారిలో పోటీకి ససేమిరా అంటున్న వారున్నారు. దీంతో సిక్కోలు ఎంపీ సీటు కొట్టడం ఎలా అన్నది అగ్ర నాయకత్వానికి సవాల్ గా మారుతోంది. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వస్తారనుకున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి హ్యాండ్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో అనూహ్యంగా మరో సీనియర్ నాయకుని కుటుంబం వైసీపీలో చేరుతోంది.

పట్టున్న కుటుంబం

శ్రీకాకుళం జిల్లాలో బొడ్డేపల్లి కుటుంబం మంచి పట్టున్న రాజకీయ కుటుంబంగా పేరు గాంచింది. బొడ్డేపల్లి రాజగోపాలరావు ఎంపీగా ఇక్కడ నుంచి గెలిచి మంచి నాయకత్వాన్ని అందించారు. ఇక ఆయన కోడలుగా రాజకీయల్లోకి వచ్చిన బొడ్డేపల్లి సత్యవతి కూడా ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చూపారు. ఆ కుటుంబం వారసునిగా ఆమె కుమారుడు బొడ్డేపల్లి రమేష్ బాబు మునిసిపల్ చైర్మన్ గా పని చేశారు. ఆయన వైసీపీలోకి రావాలనుకుంటున్నారు. జగన్ సైతం దానికి సుముఖంగా ఉన్నారని టాక్. అదే కనుక జరిగితే బొడ్డేపల్లి కుటుంబం వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచి వచ్చే ఎన్నికల్లో విజయాన్ని అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

టీడీపీకి ధీటుగా

ఇక శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రామ్మోహన నాయుడు కు పోటీగా రమేష్ బాబుని నిలబెట్టాలన్న ఆలోచన వైసీపీలో ఉంది. జిల్లాలో వెలమ, కాపు, కళింగ సామాజికవర్గాల అధిపత్యం రాజకీయంగా ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు కులాలకు చెందిన వారు వరసగా గెలుస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లొ టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి రెడ్డి శాంతి పోటీ పడ్డారు. శాంతి కాపు సామాజికవర్గానికి చెందిన వారు. వైసీపీలో అంతర్గత విభేదాలు, ఇతరాత్ర కారణాలతో వైసీపీ అప్పట్లో ఓడిపోయింది.

టీడీపీకి కష్టమే…

ఈసారి మాత్రం అలా కాకుండా గట్టి అభ్యర్ధి కోసం వైసీపీ ఎదురుచూస్తోంది. బొడ్డేపల్లి కుటుంబానికి ఉన్న రాజకీయ నేపధ్యం, పెరిగిన పార్టీ గ్రాఫ్ అన్నీ కలసి వైసీపీకి ఇక్కడ గెలుపు సులువు అవుతుందని అంచనాలు వేస్తున్నారు. బొడ్డేపల్లి రమేష్ చేరుతారన్న వార్తలపైన టీడీపీలో కలవరం రేగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనే అభ్యర్ధి అయితే గెలుపునకు బాగా కష్టపడాలని కూడా ఆ పార్టీలో చర్చ సాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*