ఏది నిజం…? ఏది అబద్ధం?

ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ వ్యవహారం మరింత ముదిరింది. అధికార ,ప్రతిపక్ష పార్టీలు తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ వైసీపీ ఆరోపిస్తుండగా, ఈ వ్యవహారం ఆగిపోవడానికి వైసీపీయే కారణమంటూ టీడీపీ ఆరోపణలు ప్రారంభించింది. అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. వారికి ప్రయోజనం చేకూర్చడంపై దృష్టి పెట్టకుండా రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికే సమయాన్ని వెచ్చిస్తున్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

విలువైన ఆస్తులను….?

అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్సెల్ గ్రూపు ముందుకొచ్చింది. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకుంది. అయితే ఆస్తుల విలువ 2,500 కోట్లు మాత్రమే ఉందని ఎస్సెల్ గ్రూపు వెనక్కు తగ్గడంతో ఇప్పుడు బాధితులకు న్యాయం చేసెదెలా? అన్న దానిపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 35 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని, విలువైన ఆస్తులను వేలంలో పెట్టకుండా టీడీపీ నేతలు సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. హాయ్ ల్యాండ్ వంటి భూములను వేలంలో ఎందుకు చేర్చలేదంటూ వైసీపీ నిలదీస్తుంది. అగ్రిగోల్డ్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

వైసీపీవి తప్పుడు ఆరోపణలు…..

కాగా వైసీపీయే అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని తప్పుదోవపట్టిస్తుందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఐదు వేల కోట్ల రూపాయలు జగన్ ఇస్తే అగ్రిగోల్డ్ ఆస్తుల మొత్తాన్ని జగన్ పార్టీకి ఇవ్వడానికి రెడీ ఉన్నామని టీడీపీ సవాల్ విసిరింది. అగ్రిగోల్డ్ ఆస్తులు 35 వేల కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పడం అవాస్తవమని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పారు. సదావర్తి భూముల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా ప్రవర్తించిందని ఆయన గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ ఆరు వేల కోట్ల రూపాయలకు మించి ఉండదన్నారు. డిపాజిటర్లకు చెల్లించాల్సింది పదివేల కోట్లు రూపాయలు ఉంటాయని, కాని ఎస్సెల్ గ్రూపు అంచనా మాత్రం 2,500 కోట్లు మాత్రమే ఉండటంతో ఆ కంపెనీ వెనక్కు తగ్గిందన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాన్ని కాపాడేందుకు తాము అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. దయచేసి అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. మొత్తం మీద అగ్రిగోల్డ్ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఈ నెల 25వ తేదీన కోర్టులో అఫడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అగ్రిగోల్డ్ విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో తమ సొమ్ములు తమకు దక్కుతాయా? లేదా? అన్న ఆందోళన డిపాజిటర్లలో కన్పిస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*