వైసీపీ విశాఖ టిక్కెట్ ఆయనకే కన్ఫర్మా?

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల మూమెంట్ స్టార్ట్ అవ్వడంతో ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ఓవైపు ప్రత్యేక హోదా కోసం పార్టీలు పోటాపోటీగా ఉద్యమిస్తున్నాయి. మ‌రోవైపు ఇన్నాళ్లూ త‌ట‌స్థంగా ఉన్న ప‌లువురు నేత‌లు, సైలెంట్‌గా ఉండిపోయిన నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి.. ఏ పార్టీలోకి వెళ్తే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్యత్ ఉంటుంది..? అంటూ త‌మ‌త‌మ స్థానాల‌ను వెతుక్కునే ప‌నిలో ప‌డ్డారు. టీడీపీలో ఇప్పటికే ఆశావహుల తాకిడి ఎక్కువగా వుండడంతో వారి చూపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తోపాటు జనసేనపైన పడింది.

టీడీపీ నేతపై ఆగ్రహంతో….

టీడీపీలోని ఒక నేతపై వ్యక్తిగత ప్రతీకారంతో రగిలిపోతున్న నగరానికి చెందిన ప్రముఖ బిల్డర్‌ ఎంవీవీ సత్యనారాయణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరపున విశాఖ ఎంపీ టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు స‌మాచారం. నగరంలో తనకు తెలిసిన ఒక ఆడిటర్‌ ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కొన్నాళ్ల కిందట ప్రకాశం జిల్లాలో పాదయాత్రలో ఉన్న సమయంలో ఆడిటర్‌తో కలిసి సదరు బిల్డర్‌ అక్కడికి వెళ్లినా.. జగన్‌ను కలిసే అవకాశం రానప్పటికీ ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆడిటర్‌కు తెలిసిన కీలక నేతను కలిసి తన మనసులోని మాటను చెప్పిన‌ట్లు స‌మాచారం.

విశాఖ ఎంపీ టిక్కెట్ ఇస్తే….

టీడీపీ నేత తనను ఎలాంటి ఇబ్బందులకు గురిచేశారు…తాను ఎలాంటి ప్రతీకారం కోరుకుంటున్నాననే దానిని ఆయనకు వివరించినట్టు సమాచారం. బిల్డర్‌ ప్రతిపాదనను పార్టీ అధినేత జగన్‌కు వివరించడంతోపాటు పార్టీలో చర్చించిన తర్వాత విషయం తెలియజేస్తానని సదరు కీలక నేత చెప్పినట్టు తెలుస్తోంది. తనకు ఎంపీ టిక్కెట్‌ ఇస్తే తన ఖర్చు తానే పెట్టుకుంటానని, పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వనక్కర్లేదని సదరు బిల్డర్‌ చెప్పినట్టు స‌మాచారం. అలాగే తన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా తానే సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

విశాఖకు వచ్చినప్పుడు….

పార్టీ అధిష్ఠానం అంగీకరిస్తే జగన్‌ పాదయాత్ర విశాఖ నగరానికి వచ్చినప్పుడు ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటానని బిల్డ‌ర్‌ చెప్పినట్టు తెలిసింది. దీనిపై పార్టీ నేతలు గానీ, బిల్డర్‌గానీ స్పందించేందుకు ఇష్టపడకపోయినా, కొద్దిరోజుల్లో అంతా తెలిసిపోతుందని చెప్పడం గమనార్హం. అయితే ఎంవీవీ సత్యనారాయణను తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా వైసీపీ అధిష్టానం కోరుతున్నట్టు చెబుతున్నారు. అలాగే బిల్డర్‌తోపాటు జిల్లాలో కొంతకాలంగా తటస్థంగా ఉన్న సీనియర్‌ నాయకులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. జగన్‌ పాదయాత్ర నగరానికి చేరుకునే నాటికి స్పష్టత వ‌స్తుంద‌ని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*