
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు అనూహ్యమలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల కదలికల్లో మార్పులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును ఇతర నియోజకవర్గానికి సాగనంపి.. మరో నాయకుడు తక్కళ్లపల్లి రవీందర్రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచైనా గెలుస్తాడనీ… తనకుమాత్రం పాలకుర్తి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం వద్ద తక్కళ్లపల్లి రవీందర్రావు పట్టుబడుతున్నట్లు సమాచారం.
జనగామ నుంచి…..
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరగడం గమనార్హం. ఎర్రబెల్లికి జిల్లాలో మంచి పట్టుంది. గతంలో వర్థన్నపేట నుంచి వరుస విజయాలు సాధించిన ఆయన ఆ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో పాలకుర్తికి మారి ఇక్కడ కూడా రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ వాదం బలంగా ఉన్న వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి టీడీపీ తరపున గెలవడం నిజంగా రికార్డు. ఇక 2008 ఉప ఎన్నికల్లో ఎర్రబెల్లి వరంగల్ ఎంపీగా కూడా గెలిచారు.
పాలకుర్తిలో పర్యటనలతో….
నిజానికి పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల పర్యటనలు ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి, మంత్రి పదవి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎర్రబెల్లి భార్య కూడా ప్రతి రోజు నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి కూడా నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నతక్కళ్లపల్లి రవీందర్రావు కూడా ఈసారి పాలకుర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు అంతర్గతంగా నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. చాపకింది నీరులా తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు కనుక టికెట్ ఇవ్వకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తాననని తన సన్నిహితుల వద్ద తక్కళ్లపల్లి అంటున్నట్లు సమాచారం. ఎర్రబెల్లిని టెన్షన్లో పెట్టేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా టాక్.
ప్రత్యేక నిధులు తెచ్చి…..
2014ఎన్నికల్లో టీడీపీ నుంచి కొద్దిపాటి మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. ఒకే సామాజికవర్గం కావడంతో సీఎం కేసీఆర్ వద్ద మంచి పలువుకుబడి ఉంది. ఈ క్రమంలోనే నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కూడా మంజూరు చేయించుకున్నారు. అయితే.. ఎర్రబెల్లిని మాత్రం వివిధ రూపాల్లో కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ పాత క్యాడర్ తెలంగాణ ఉద్యమకారుల సంఘం పేరుతో వేరుకుంపటి పెట్టడం… దీనికి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి చేతిలో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్ సుధాకర్‌రావు మద్దతు ఉందని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. తాజాగా.. ఈ సంఘానికి తక్కళ్లపల్లి రవీందర్రావు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొన్న మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గం నుంచి ఈ సంఘం నేతలకు వాహనాలు సమకూర్చి పంపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణలో ఎంత కాకలు తీరిన రాజకీయ యోధుడు అయినా వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లికి సీటు విషయంలో సొంత పార్టీ నుంచే కష్టాలు తప్పేలా లేవు.
Leave a Reply