ఎర్రబెల్లిలో అంత సంతోషం ఎందుకంటే?

ఉమ్మడి వరంగల్‌ జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్ ఛార్జ్ జంగా రాఘవరెడ్డి పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం జిల్లాలో, కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఆయనపై మడికొండ పోలీస్ స్టేషన్‌లో దాడి, చంపుతానని బెదిరింపులు, జేసీబీ దొంగతనం తదితర ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్‌ అర్బన్ జిల్లాలోని మడికొండ, ధర్మసాగర్ రహదారి పక్కన మిషన్ భగీరథ పనులు నడుస్తున్నాయి. అదే మార్గంలో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ సూపర్ వైజర్ కు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్న వారికి మధ్య కొంతకాలంగా వైరం నడుస్తోంది.

ఆదినుంచి వివాదాలే…..

రోడ్డు పని చేపడుతున్న వ్యక్తి జంగారాఘవ రెడ్డికి బంధువు కావడంతో ఆయన మిషన్ భగీరథ సూపర్ వైజర్ తో ఘర్షణకు దిగారు. అందరూ చూస్తుండగానే సూపర్ వైజర్ పై భౌతిక దాడికి దిగి, నానా దుర్బాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు జంగాపై కేసు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. డీసీసీబీ మాజీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డికి ఆది నుంచీ వివాదాస్పదుడుగానే పేరుంది. ఆయనపై గతంలో జిల్లాలో భూకబ్జాలు, సెటిల్ మెంట్ లు, దందాలు తదితర ఆరోపణలు ఉన్నాయి.

బ్యాంకు నిధుల గల్లంతులో…..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీడీపీ నేత కొల్లి ప్రతాప్ రెడ్డి హత్య కేసులోనూ జంగాకు ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతేకాక ఇటీవల జిల్లా సహాకార బ్యాంక్ ఛైర్మన్ గా ఉండి పెద్ద ఎత్తున నిధులు కొల్లగొట్టాడని విమర్శలు వెల్లువెత్తాయి. డీసీసీబీలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఋజువవ్వడంతో ప్రభుత్వం ఆయనను ఛైర్మన్ పదవి నుంచి తొలగించింది. ఇదిలా ఉండగా డీసీసీబీ ఛైర్మన్‌ పదవిని కోల్పోయిన తర్వాత జంగా రాఘవరెడ్డి పాలకుర్తి నియోజకవర్గంపై కన్నేసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న జంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

రాజకీయంగా ఇబ్బందేనా?

ఈ క్రమంలో అనూహ్యంగా కేసుల పాలవడంతో రాజకీయంగా జంగాకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ వివాదం అధికార పార్టీకి కలిసొచ్చే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇటీవల‌ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు జంగా రాఘవరెడ్డిపై బహిరంగంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించారు. తాజాగా జంగా కేసుల్లో ఇరుక్కోవడంతో ఎమ్మెల్యే దయాకర్ రావుకు మరింతగా కలిసొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జంగా రాఘవరెడ్డి తన దూకుడు ప్రవర్తనతో కేసుల పాలవడం పార్టీకి నష్టం కలిగించొచ్చని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*