యోగి వల్ల కాదని తేలిపోయిందా?

ఉపఎన్నికల్లో వరుస ఓటములు యోగి ఆదిత్యానాధ్ క్రెడిబిలిటీని దెబ్బతీశాయా? ఆయన ఇమేజ్ పూర్తిగా పడిపోయిందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుందా? ఇదే కంటిన్యూ అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని భావించిన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం యూపీపై దృష్టి పెట్టింది. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి ఆదిత్యానాధ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటీకీ సామాన్య ప్రజల్లో అవి ఏమాత్రం ప్రభావం చూపించలేదని అర్థమైంది. శాంతి భద్రతల సమస్య సజావుగానే ఉన్నప్పటికీ ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో యోగిసర్కార్ విఫలమవుతుందని పార్టీ కేంద్ర నాయకత్వం అభిప్రాయపడుతుంది.

వచ్చే లోక్ సభ ఎన్నికలకు…..

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పై కమలనాధులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లోక్ సభ ఎన్నికలు ఇంకా ఏడాది ఉండటంతో యూపీలో గతంలో మాదిరిగానే ఫలితాలు రావాలన్న లక్ష్యాన్ని కమలనాధులు నిర్దేశించుకున్నారు. గత ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 71 స్థానాలు దక్కాయి. అయితే ఇటీవల జరిపించిన సర్వేల్లో మాత్రం అందులో సగానికిపైగా రావని తేలిపోయింది. దీంతో ఎలాగైనా యూపీలోనే అత్యధిక స్థానాలను సంపాదించాలన్న ధ్యేయంతో చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు విపక్షాలు అన్నీ ఏకమైపోతున్న వేళ యూపీలో బీజేపీ అప్రమత్తమయిందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

కూటమిగా ఏర్పడినా…..

సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలు మహాకూటమిగా ఏర్పడి వచ్చే లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొననుండటంతో కమలనాధులు యూపీలోని పాలనపై తమ ముద్రవేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీలోనూ భారీ మార్పులను చేయాలని నిర్ణయించింది. యూపీలో సంఘ్ పరివార్ ను కలుపుకుని వెళ్లాలని ఇప్పటికే కేంద్ర నాయకత్వం యోగి ఆదిత్యానాధ్ ను ఆదేశించింది. యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని బీజేపీ శ్రేణులు అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేశాయి.

ప్రక్షాళనకు సిద్ధమైన….

అందుకనే యోగి ఆదిత్యానాధ్ కు స్పష్టమైన ఆదేశాలు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం వరకూ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. పార్టీ విస్తారక్ లు ఇక ప్రతి నియోజకవర్గంలో కీలక భూమిక పోషిస్తారని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని యోగి ఆదిత్యానాధ్ ను అమిత్ షా కోరినట్లు సమాచారం. అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా మార్పులు చేసుకుని పరిపాలన ప్రజల చెంతకు చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. యూపీ ఇన్ ఛార్జి సునీల్ బన్సాల్ ను కూడా కేంద్ర నాయకత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. మొత్తం మీద వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి పార్టీకి విజయం చేకూరేందుకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రక్షాళన చేయాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*