టీడీపీ బిగ్ షాట్సే…..జగన్‌ టార్గెట్‌..!

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ సీఎం అవ్వాలని ఫైట్ చేస్తోన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌ గత పది నెలలగా ప్రజల్లోనే యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్‌ చెయ్యబోతున్నారా? టీడీపీలో ఉన్న పలువురు సీనియర్లను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వారు అసెంబ్లీలో లేకుండా చెయ్యాలని జగన్‌ ఎత్తుగడ వేస్తున్నారా ? అంటే వైసీపీలో తాజా రాజకీయ పరిణామాలు.. జగన్‌ తాజా వ్యూహాత్మక ఎత్తుగడలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌కు ఏపీ టీడీపీలో కొంత మంది సీనియర్లతో పాటు కేబినెట్‌లో ఉన్న మంత్రులు కొరకరాని కొయ్యలుగా మారారు. జగన్‌ను పదే పదే మాటల తూటాలతో టార్గెట్‌ చేస్తున్నారు.

కీలకమంత్రులను ఓడించడం ద్వారా……

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వారు ప్రాధినిత్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారిని ఓడించి వచ్చే అసెంబ్లీలో వారు లేకుండా చెయ్యాలన్నదే జగన్‌ ప్లాన్‌. ఈ విష‌యాన్ని కొంద‌రు వైసీపీ నాయ‌కులు కూడా ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. జగన్‌ను ప్రముఖంగా టార్గెట్‌ చేసినవారిలో జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఏపీలో కీలకమైన రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు. జగన్‌ వచ్చే ఎన్నికల్లో ఏపీ కేబినెట్‌లో కీలకంగా ఉన్న ఈ మంత్రులను ఓడించడం ద్వారా టీడీపీకి పెద్ద షాకే ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి అన్ని కోణాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారు.

కేపీ ఎంట్రీతో…….

మైలవరం నుంచి ప్రాధినిత్యం వహిస్తున్న జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించి ఆయన వచ్చే అసెంబ్లీలో లేకుండా చెయ్యాలని వైసీపీలో చాలా మంది నాయ‌కుల‌తో పాటు ఆ పార్టీ అధినేత జగన్‌ పెద్ద ప్రణాళికలే రచిస్తున్నారు. ఈ క్రమంలోనే మైలవరంలో ఉమాను ఓడించేందుకు అదే జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దింపారు. గతంలో కృష్ణప్రసాద్‌, ఉమా నందిగామ‌లో పోటీ పడ్డారు. నాడు తన సోదరుడు దేవినేని వెంకటరమణ మృతి చెందిన సానుభూతి ప‌వ‌నాల‌ నేపథ్యంలో ఉమా విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య నందిగామలో రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. ఆ తర్వాత వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరినా తగిన ప్ర‌యారిటీ లేకపోవడంతో తిరిగి వైసీపీ గూటికి చేరారు. ఈ క్రమంలోనే సామాజికపరంగానూ, ఆర్థిక పరంగానూ ఉమాకు కేపీ స‌రైన‌ అభ్యర్థి కానున్నారు. కేపీ ఎంట్రీతో మైలవరంలో ఉమాకు ముచ్చెమటలు పడుతున్నాయి అన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న టాక్‌.

ఇక్కడ బలమైన నేతను….

శ్రీకాకుళం జిల్లాలో టెక్క‌లి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలోనూ, బయటా జగన్‌ అంటే ఏ రేంజ్‌లో విరుచుకుపడతారో, ఎంత తీవ్రస్థాయిలో ధ్వ‌జమెత్తుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో జగన్‌ను తిట్టేశాఖ ఏ మంత్రికైనా అప్పగిస్తే అది అచ్చెన్నాయుడికి ఇవ్వాలని కూడా వైసీపీ వాళ్లు అచ్చెన్న‌పై సెటైర్లు వేశారు. లాజిక్‌ లేకుండా జగన్‌ను పదే పదే టార్గెట్‌ చెయ్యడంలో అచ్చెన్న‌ది అందివేసిన చేయి. వచ్చే ఎన్నికల్లో అచ్చెన్న‌ను ఎలాగైన ఓడించాలని చూస్తున్న జగన్‌ సామాజిక సమీకరణల పరంగా అక్కడ కాళింగ సామాజికవర్గానికి చెందిన వారిని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్క‌డ మంత్రి సామాజిక‌వ‌ర్గం కంటే కాళింగ‌లే ఎక్కువ‌. అక్కడ ఇప్పటికే సీటు కోసం పోటీ పడుతున్న‌ దువ్వాడ శ్రీనివాస్‌, పేరాడ తిలక్‌తో పాటు త్వ‌ర‌లో పార్టీలో చేర‌తార‌ని భావిస్తున్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మధ్య సమన్వయం చేసి అచ్చెన్న‌ను ఓడించాలన్నదే జగన్‌ ప్లాన్‌.

రజనీ ఎంట్రీతో……..

ఇక కీలకమైన గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఈ సారి జగన్‌ అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చారు. ఆర్థికంగానూ, సామాజిక సమీకరణల పరంగా ఎన్నారై లేడీ విడదల రజినీని పుల్లారావు మీదకు పోటీకి దింపుతున్నారు. బలమైన వాయిస్‌, దూకుడుగా జనాల్లోకి చొచ్చుకుపోయే రజినీ ఎంట్రీతో పుల్లారావుకు ఇప్పటికే ముచ్చెమటలు స్టార్ట్‌ అయ్యాయి. ఏదేమైనా టీడీపీలో సీనియర్లుగా ఉండి, మంత్రులుగా ఉన్నవారిని ఓడించేందుకు జగన్‌ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు మరి ఎంత వరకు ఫ‌లిస్తాయో ? చూడాల్సి ఉంది.