జగన్ ఆఖరి ప్రయత్నం…సక్సెసయ్యేనా….?

ys jaganmohanreddy last trials

ఏపీలో రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో విపక్ష వైసీపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాల్లో టీడీపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు వైసీపీ అధినేత జగన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకునేందుకు సిద్ధమవువుతున్నారు. జిల్లాల్లో ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో సీనియర్‌ నాయకులను సైతం పక్కన పెట్టేసి వారి స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్‌ ఇచ్చిన జగన్‌ ఇప్పుడు మరిన్ని షాకింగ్ డెసిషన్ల‌కు రెడీ అవుతున్నట్టే తెలుస్తోంది. ఎన్నికలలోగా మరో ఆరు నియోజకవర్గాల‌ ఇన్‌చార్జులను మార్చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తెర వెనక వ్యూహాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇదే టైమ్‌లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను సైతం పక్కన పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా జిల్లా వైసీపీలో చర్చలు నడుస్తున్నాయి.

ఎవరూ ఫిరాయించకుండా….

ఏపీలో చాలా జిల్లాల్లో వైసీపీ టిక్కెట్‌పై గెలిచిన వారిలో పలువురు అధికార టీడీపీలోకి జంప్‌ చేసేశారు. గుంటూరు జిల్లాలో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ కూడా పార్టీ పిరాయించలేదు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా వారు పార్టీలోనే కొనసాగుతూ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జగన్‌ ఈ ఐదుగురు సిట్టింగుల్లో ఒకరిద్దరిని మార్చే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. జగన్‌ చిలకలూరిపేట నియోజకవర్గంలో సుదీర్ఘ‌మైన రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీకి చెందిన, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పని చేసిన మర్రి రాజశేఖర్‌ను పక్కన పెట్టి ఎన్నారై మహిళ విడదల రజినీకి పగ్గాలు అప్పగించారు. అలాగే గుంటూరు వెస్ట్‌లో జగన్‌కు నమ్మిన బంటుగా ఉన్న లేళ్ళ అప్పిరెడ్డిని తప్పించి ఆయన స్థానంలో మాజీ పోలీస్‌ అధికారి చంద్రగిరి యేసురత్నంను నియమించారు. తాడికొండలో గత ఎన్నికల్లో ఓడిన హెన్నీ క్రిస్టియానాను తొలగించి ఆమె స్థానంలో హైదరాబాద్‌లో డాక్టర్‌గా పని చేస్తున్న నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవిని ఇన్‌చార్జ్‌గా నియమించారు.

మరో ఆరుగురిపై…..

అలాగే పెదకూరపాడులో నాలుగేళ్లుగా పార్టీని భుజస్కంధాన వేసుకుని కాడి లాక్కొస్తున్న కావటి మనోహర్‌ నాయుడుని తప్పించి ఆ స్థానంలో నంబూరి శంకర్‌రావును రంగంలోకి దింపారు. ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో ఊహించని విధంగా షాకుల మీద షాకులు ఇస్తూ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపిన జగన్‌ ఇప్పుడు జిల్లాల్లో మరో ఆరుగురుపై వేటు వేస్తారని గుంటూరు జిల్లా వైసీపీలోనే చర్చలు నడుస్తున్నాయి.గుంటూరు జిల్లాలో రెండో విడతలో పడే ఆరు వికెట్లలో వినుకొండ, పొన్నూరు, వేమూరు, తెనాలి, సత్తెనపల్లి, రేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జులు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే జగన్‌ కట్టకట్టుకుని వీరందరిని మార్చేస్తారా లేదా వీరిలో కొందరిని మారుస్తారా ? అన్నదే చూడాల్సి ఉంది. వినుకొండలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నన్నపునేని రాజకుమారి కుమార్తె నన్నపునేని సుధ‌ ఓడిన వెంటనే అడ్రస్‌ లేకుండా పోయారు. దీంతో జగన్‌ గత ఎన్నికల్లో పెదకూరపాడులో పోటీ చేసి ఓడిన బొల్లా బ్రహ్మనాయుడుకు తిరిగి వినుకొండ పగ్గాలు అప్పగించారు. ప్రస్తుతం బ్రహ్మనాయుడు వినుకొండలో పని చేస్తున్నా అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జీవీ. ఆంజనేయులను ఢీ కొట్టే బలమైన ప్రత్యర్థి కాదన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆంజనేయులు సామాజికవర్గం నుంచే ఆర్థికంగా బలవంతుడైన వ్య‌క్తి కోసం వైసీపీ అన్వేషిస్తోంది.

అన్ని రకాల ఈక్వేషన్లు…..

ఇక పొన్నూరులో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రావి వెంకటరమణ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం కష్టపడుతున్నా ఆర్థికంగా స్థితిమంతుడు కాకపోవడంతో ఆయన స్థానంలో వేరే వారిని నియమిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచ‌న‌లో అధిష్టానం ఉన్న‌ట్టు ప్రచారం జరుగుతోంది. అనేక రకాల ఈక్వేషన్ల నేపథ్యంలో అంబటి రాంబాబు పేరు కూడా పొన్నూరులో వినిపిస్తోంది. ఎస్సీ నియోజకవర్గం అయిన వేమూరు ఇన్‌చార్జ్‌గా ఉన్న మేరుగు నాగార్జున గత రెండు ఎన్నికల్లో వరసగా ఓడిపోతూ వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి నక్కా ఆనంద్‌బాబును ఢీ కొట్టేంత ఆర్థిక సామర్థ్యం నాగార్జునకు లేదన్న అభిప్రాయానికి జగన్‌ వచ్చినట్టు తెలుస్తొంది. ఈ క్రమంలోనే ఎస్సీ సామాజికవర్గం నుంచి కేంద్ర సర్వీసుల్లో పని చేసిన ఒకరిద్దరు అధికారుల పేర్లు వేమూరుకి వినిపిస్తున్నాయి. ఇక తెనాలి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అన్నాబత్తుని శివకుమార్‌ అక్కడ టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఢీ కొట్టేందుకు సరైన ప్రత్యర్థి కాదని… ఇదే క్రమంలో తెనాలిలో కూడా కమ్మ సామాజికవర్గం నుంచి ఆర్థికంగా బలమైన వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతోంది. శివకు టిక్కెట్‌ లేదన్న విషయం ఇప్పటికే జిల్లా వైసీపీలో కొందరు కీలక నాయకులకు సైతం ఉప్పందింద‌ని టాక్‌.

అంబటిని మారుస్తారా…?

ఇక సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన అంబటి రాంబాబుకు సీటు ఇస్తారా లేదా అన్నది సందేహమే అంటున్నారు. ఆయన కోడెలను ఢీ కొట్టేలా నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చెయ్యలేదన్న నివేదికలు జగన్‌ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సత్తెనపల్లి నుంచి గతంలో రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే య‌ర్రం వెంకటేశ్వరరెడ్డికి ఛాన్స్‌ ఇవ్వచ్చని టాక్‌. అదే క్రమంలో సమీకరణలు మారితే అంబటి రాంబాబు పేరు పొన్నూరు నుంచి కూడా పరిశీలనకు రానుంది. ఇక తీర ప్రాంతం అయిన రేపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అనారోగ్యంతో ఉండడంతో అక్కడ ఆయన భార్యకు ఇస్తారని లేదా మరో మాజీ ఎమ్మెల్యే పేరు సైతం అక్కడ నుంచి పరిశీలనకు వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా జగన్‌ గుంటూరు జిల్లా వైసీపీలో ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా ఎన్నికల ముందు వరకు మరో ఆరేడు నియోజకవర్గాల్లో పాత వారిని మార్చి కొత్త వారిని ఛాన్స్‌ ఇవ్వచ్చని అక్కడ రాజకీయ పరిణామాలు చెప్పేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*