జగన్ కు పెద్ద ప్లాబ్లమేనా…?

ys-jaganmohanreddy-ysrcongress-party

వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఆయన ఇప్పటికే కొందరు నేతలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకు జగన్ పెద్దల సభకు పంపుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో జగన్ అధికారంలోకి వచ్చినా వారిని పెద్దల సభకు పంపాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజ్యసభకు వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పోటీ బాగా ఉంది. రాజ్యసభతో పాటు ఎమ్మెల్సీలుగా కొందరికి జగన్ ఇప్పటికే స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారు జగన్ అధికారంలోకి రావాలని పదే పదే కోరుకుంటున్నారు.

వైవీకి ఖచ్చితంగా…

వైవీ సుబ్బారెడ్డి…. జగన్ కు దగ్గర బంధువు. గత ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా కోసం తన పదవికి ఆరు నెలల ముందు రాజీనామా చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డికి జగన్ టిక్కెట్ ఇవ్వలేక పోయారు. మరో బలమైన నేత, టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చివరి నిమిషంలో వైసీపీలో చేరడంతో మాగుంటకే టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు జగన్. దీంతో వైవీసుబ్బారెడ్డికి టిక్కెట్ దక్కలేదు. ఆయనను ఉభయ గోదావరి జిల్లాల ఇన్ ఛార్జిగా నియమించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైవీకి రాజ్యసభ ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

మేకపాటికి తప్పదా….?

ఇక నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిస్థితి కూడా దాదాపు అంతే. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డికి జగన్ ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు. ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి జగన్ టిక్కెట్ ఇచ్చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డికి ఆత్మకూరు శాసనసభ, సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి శాసనసభ టిక్కెట్లను ఇచ్చారు. అయితే మేకపాటికి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది.

కిల్లి కృపారాణికి…

శ్రీకాకుళం జిల్లాలో కీలక నేత కిల్లి కృపారాణి పరిస్థితి కూడా అంతే. ఆమెకు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్ ఇస్తారని అందరూ ఊహించారు. శ్రీకాకుళం పార్లమెంటు గాని, టెక్కలి అసెంబ్లీ సీటు ఇస్తారని భావించినా జగన్ ఆమెకు ఏ టిక్కెట్ ఇవ్వకుండా పార్లమెంటు ఇన్ ఛార్జిగా నియమించారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణికి ఖచ్చితంగా రాజ్యసభ, లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ పార్టీలో చేరేముందు స్పష్టమైన హామీ ఇచ్చారని కిల్లి వర్గీయులు చెబుతున్నారు. వీరితో పాటు టిక్కెట్లు రాని అనేకమంది నేతలు అధికారంలోకి రాగానే తమకు పదవులు వస్తాయని ఆశలు పెంచుకున్నారు. దాడి వీరభద్రరావు, పండుల రవీంద్రబాబు వంటి వారు కూడా పదవులు తమకు గ్యారంటీ అని చెబుతున్నారు. మరి అధికారంలోకి వస్తే జగన్ తొలుత దీనిపైనే పెద్ద కసరత్తు చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 15997 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

1 Comment on జగన్ కు పెద్ద ప్లాబ్లమేనా…?

  1. రాష్ట్రం విడి పోక ముందు నుంచి , కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు అక్కడి నుంచి రాజీ నామా చేసి , జగన్ పార్టీ పెట్టినప్పుడే అందులో చేరిన మేకపాటి రాజ మోహన్ రెడ్డి కి టిక్కెట్టు ఇవ్వకుండా , టీ డీ పీ నుంచి వచ్చి చేరిన గాలివాటం జంప్ జిలానీ కి ఇవ్వడం , ఒక వ్యూహాత్మక తప్పిదం కావచ్చు .
    అలానే కిల్లి కృపారాణి విషయం . ఉభయ తెలుగు రాష్ట్రాలలో ని , పార్టీ లతో సంబంధం లేకుండా , అందరు రాజకీయ నాయకుల పదవీ దాహం , అంతు లేనిది . జగన్ ఎలా బ్యలన్సు చేస్తాడో చూడాలి .

Leave a Reply

Your email address will not be published.


*