జగన్ కు ఈ జంఝాటం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ లో దిక్కులు చూస్తున్న కమలానికి కాసింత దూరంలో ఫ్యాన్ గాలి తగులుతున్నట్లుంది. కొంచెం చెంతకు రాకూడదూ ఇద్దరికీ ప్రయోజనదాయకమంటూ కబురంపే యత్నాల్లో పడ్డారు. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే తాజాగా జగన్ వచ్చి తమ కూటమిలో చేరిపోవాలని ఉచిత సలహానిచ్చేశారు. పైపెచ్చు జగన్ పై ఉన్న ఆరోపణలేమీ రుజువు కాలేదంటూ అభయమిచ్చారు. నిన్నామొన్నటివరకూ బీజేపీ చేస్తూ వస్తున్న వాదనకు ఇది పూర్తి విరుద్ధమైనది. నేరుగానే ఆహ్వానాలు పంపేస్తున్నారు. రారమ్మంటూ పిలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీ, వైసీపీల పొత్తుపై చాలాకాలంగానే ఆరోపణలు చేస్తోంది. కానీ కమల నాథులు ఖండిస్తూ వస్తున్నారు. వైసీపీ మాత్రం ప్రత్యేక హోదా తో ముడిపెట్టి బీజేపీతో ఆప్షన్లను బహిరంగంగానే ఉంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయ వ్యూహం లేకుండా మంత్రి మరీ తేలికగా బహిరంగంగా పిలిచేయడమే చర్చనీయమవుతోంది. ఇది వైసీపీకి ఇరకాటంగా మారింది. లాభమో, నష్టమో తేల్చకోకుండా తప్పుడు సంకేతాలు పంపినట్లయ్యిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

బాబోయ్ బాజపా…

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ బీజేపీతో సున్నితంగానే వ్యవహారాలు నడుపుతోంది. ప్రత్యేక హోదా డిమాండు తొలి నుంచీ వినిపిస్తున్నప్పటికీ కమలంతో కయ్యానికి దిగడం లేదు. మోడీ, అమిత్ షాల పై విమర్శలు కురిపించడం లేదు. పొత్తులో లేని మిత్రునిగానే వ్యవహరిస్తోంది. కేంద్రప్రభుత్వంపై అడపాదడపా విమర్శలు చేస్తున్నప్పటికీ వాటి తీవ్రత తక్కువే. ఈ శైలిని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం పార్టీ వైసీపీని బీజేపీతో అంటకట్టి ఆరోపణలు చేస్తోంది. నిజానికి బీజేపీ పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు భయపడే పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా బీజేపీ ఇమేజ్ ను గంగలో కలిపేయడంలో తెలుగుదేశం తీవ్రంగా కృషి చేసింది. ప్రత్యేక హోదా అంశాన్ని ఆయుధంగా ప్రయోగిస్తూ పార్టీ కి ప్రజల్లో ఉన్న ఆదరణను ఛిన్నాభిన్నం చేసేసింది. కమలం పార్టీని ఏపీ ప్రజలు శత్రువగా భావించే వాతావరణం నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెసు పార్టీకంటే కూడా బాగా దెబ్బతింది. 2014లో కాంగ్రెసును రాష్ట్రప్రజలు ఎంతటి వ్యతిరేక భావంతో చూశారో అదే పరిస్థితి నేడు బీజేపీకి ఎదురవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే హస్తం పార్టీ కంటే ఎక్కువగానే కమలాన్ని అసహ్యించుకుంటున్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంటు బాగా నాటుకుపోవడంతో ఈ స్థితి ఏర్పడింది. అందుకే బీజేపీతో ఎవరు అంటకాగినా ఎదురుదెబ్బలు తప్పవు. దీనిని గ్రహించిన టీడీపీ ఫ్యాన్ పార్టీకి, కమలానికి లంకె పెట్టాలని చూస్తోంది. ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయనే సంకేతాలను ప్రజల్లోకి పంపగలిగితే వైసీపీ నష్టపోతుంది. టీడీపీ గట్టెక్కగలుగుతుందనే అంచనాతో చిలువలుపలవులు చేర్చి మరీ ప్రచారం సాగిస్తున్నారు. టీడీపీని వైసీపీ ఘాటుగానే ఎదుర్కొంటోంది. నాలుగేళ్లు కలిసి సాగిన తర్వాత రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారంటూ తిప్పికొడుతున్నారు. కానీ సాక్షాత్తూ బీజేపీ నేతలే తాము వైసీపీకి దూరం కాదంటూ ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేయడంతో వైసీపీ కి నైతికంగా దెబ్బతగులుతోంది. ఎన్నికల్లో ప్రజలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే అంతేసంగతులు. టీడీపీకి ఎడ్జ్ దక్కుతుంది.

డోర్స్ ఓపెన్….

భారతీయ జనతాపార్టీ దేశం మొత్తమ్మీద ఒకే వ్యూహాన్ని అమలు చేస్తోంది. తమకు బలం లేనిచోట్ల ఎవరు వచ్చినా అక్కున చేర్చుకొంటుంది. కాలక్రమంలో దానిని నిర్వీర్యం చేసి ఆక్రమించేసుకొంటుంది. ఇదే ద్విముఖ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తెలుగుదేశం పార్టీతో ఇంతవరకూ సంబంధాలు నెరపింది. ఆపార్టీ రాజకీయ కారణాలతో బీజేపీని దూరంగా పెట్టింది. ఇప్పుడు ఆ పార్టీకి ఏదో ఒక ప్రధానపార్టీ అండగా ఉండాలి. టీడీపీతో పొత్తు కొనసాగుతుండగానే జనసేనకు ముందస్తుగానే ఆపర్ ఇచ్చారు. కానీ పవన్ కల్యాణ్ దానిని తిరస్కరించారు. ఆ తర్వాత వైసీపీని ట్రై చేశారు. కలిసి పనిచేసేందుకు ఒకే తప్ప పొత్తుకుదరదని ఆ పార్టీ అగ్రనేతలూ తేల్చి చెప్పేశారు. అందులోనూ 2019 ఎన్నికల వరకూ తమ జోలికి రావద్దన్నారు. ప్రత్యేక హోదాను కాదంటున్నందుకు ఏపీ ప్రజలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. దానికి తోడు సహజంగానే మైనారిటీలు, దళితులు కమలానికి కాసింత దూరంగానే ఉన్నారు. వైసీపీకి ఈరెండు వర్గాలు పెట్టని కోటలు. పైపెచ్చు అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ ప్రజాగ్రహాన్ని ఎందుకు కూడగట్టుకుంటుంది. లోపాయికారీ వ్యవహారాల సంగతెలా ఉన్నప్పటికీ అధికారికంగా ఎవరికీ కమలం పొడ గిట్టడం లేదు. కానీ బీజేపీ మాత్రం ఏ పార్టీకి దూరంగా ఉండటానికి ఇష్టపడటం లేదు. తెలుగుదేశం తమంతతాము దూరమైందే తప్ప తామేమీ బయటికి పంపలేదంటూ అమిత్ షా ఇటీవల స్పష్టంగా చెప్పారు. టీడీపీతో ప్యాచ్ అప్ అవుతుందేమోననే ఉద్దేశంతో సీఎం వద్దకు గవర్నర్ ను రాయబారానికి పంపారనే ప్రచారమూ సాగింది. కానీ ఆ యత్నం వికటించింది. ఇక మిగిలినపార్టీలు రెండే రెండు. ఒకటి జనసేన, రెండు వైసీపీ. జనసేన పవన్ కల్యాణ్ అమిత్ షాతో నేరుగానే బీజేపీ వర్కవుట్ కాదని చెప్పేశారు. అనేక రకాల సమీకరణల కారణంగా వైసీపీ అంత కరాఖండిగా తేల్చలేకపోతోంది. అంతమాత్రాన బీజేపీతో ఎన్నికల్లో కలిసి నడిచే సాహసం కూడా చేయదు. పొత్తుల సంగతి తర్వాత, 2019 లో టీడీపీని గద్దె దించడమెలా? అన్న ఆలోచనలోనే నిమగ్నమై ఉన్నారు జగన్. అందుకు బీజేపీకి ఉన్న అజెండా దూరం చేస్తుందేమోననే భయం వెన్నాడుతోంది. అయినప్పటికీ పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో తెలియదు కాబట్టి పూర్తిగా తిరస్కరించలేకపోతోంది. దీనిని అలుసుగా తీసుకుని బీజేపీ ఫీలర్లు వదులుతోంది. ఇది వైసీపీ ఓటు బ్యాంకును తీవ్రంగా డ్యామేజీ చేసే అవకాశాలున్నాయి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*