జాతకాలు మారిస్తే…జాతరే…!!!

ysjaganmohanreddy changes in party

ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం దూసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో నేత‌ల్లో ఎన్నిక‌ల తాలూకు వేడి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన విప‌క్షం వైసీపీలో ఈ హ‌డావుడి ఎక్కువ‌గా ఉంది. అయితే, ఎక్క‌డిక‌క్క‌డ జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గాల జాత‌కాల‌ను తెప్పించుకుంటూ.. అక్క‌డి ప‌రిస్థితిని వైసీపీకి అనుకూలంగా మార్చే క్ర‌తువును చేప‌ట్టారు. దీనిలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను మారుస్తున్నారు. ప్ర‌ధానంగా రాజ‌ధాని జిల్లా గుంటూరును ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న జ‌గ‌న్ ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో కుదిరితే అన్నిట్లోనూ లేక‌పోతే.. మెజారిటీ స్థానా్ల‌లోనూ విజ‌యం సాధించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఇక్క‌డ ఒకింత వీక్‌గా ఉన్న నాయ‌కుల‌ను మారుస్తున్నారు. అటు ఆర్థికంగా బ‌లంగా ఉన్న వారిని కొత్త‌వారైనా స‌రే నియోజ‌క‌వ‌ర్గాల్లోకి డంప్ చేస్తున్నారు.

నిర్ణయాలను వెనక్కి….

ఈ ప‌రిణామాలు అప్ప‌టికే ఉన్న నాయ‌కుల‌కు ఒకింత ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. అయినా కూడా జ‌గ‌న్ వారిని బుజ్జ‌గిస్తున్నారే త‌ప్ప త‌న నిర్ణ‌యాన్ని మాత్రం వెన‌క్కి తీసుకోవ‌డం లేదు. టీడీపీకి కంచుకోట‌లుగాఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అధినేత టార్గెట్ చేసుకున్నారు. వాటిలో బ‌ల‌మైన నేత‌ల‌ను దింపుతున్నారు. చిల‌క‌లూరిపేట‌లో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను ఇలానే మార్చారు. ఎన్నారై మ‌హిళ‌, బీసీ వ‌ర్గానికి చెందిన విడ‌ద‌ల ర‌జ‌నీని ఇక్క‌డ నియ‌మించారు. ఈ ప‌రిణామంతో స్థానిక నాయ‌కులు, మ‌ర్రి అనుచ‌రులు తీవ్ర ఆగ్ర‌హావేశాలు ప్ర‌ద‌ర్శించారు. దాదాపు మూడు నెల‌లు పెద్ద గ‌ొడ‌వే జ‌రిగింది. అయితే, రంగంలోకి దిగిన జ‌గ‌న్‌.. మ‌ర్రికి ఎన్నిక‌ల త‌ర్వాత ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌విని ఆఫ‌ర్ చేయ‌డంతో ఒకింత ప‌రిస్థితి కూల్ అయింది.

పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి…..

ఇక‌, ఇప్పుడు గుంటూరులోని మ‌రో నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న క్రిస్టియానాను మార్చి హైద‌రాబాద్‌లో డాక్ట‌ర్‌గా ప‌ని చేస్తోన్న డాక్ట‌ర్ వుండ‌వ‌ల్లి శ్రీదేవికి జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. ఇటీవ‌లే ఆమెను ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా నియ‌మించారు. దీంతో ఇప్పుడు ఇక్క‌డ వైసీపీ శ్రేణులు కూడా ఆగ్ర‌హావేశాలు వెళ్ల‌గ‌క్కుతున్నాయి. శ్రీదేవిపై నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె వైఖరిపై నియోజకవర్గ పరిధిలోని తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలకు చెందిన కొందరు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిప‌డుతున్నారు. ఆమె చుట్టూ ఇద్దరు, ముగ్గురు నాయకులను పెట్టుకొని కోటరీలా ఏర్పరచుకున్నారని అంటున్నారు.

జగన్ కు ఫిర్యాదు చేయాలని…..

మండలాలు, గ్రామాల నుంచి వచ్చే కార్యకర్తలు, నాయకులు ముందు ఆమె వద్దనున్నవారిని సంప్రదించిన తరువాతే తనను కలవాలని, నేరుగా తనను కలిసే అవకాశం కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మండలాలు, గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులను కలుపుకుపోవాలనేది వీరి ప్ర‌ధాన డిమాండ్‌గా ఉంది. అస‌లే తాడికొండ రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ టీడీపీ మంచి బ‌లంగా ఉంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో శ్రీదేవి అస‌లు ఎవ‌రో నియోజ‌క‌వ‌ర్గ జ‌నాల‌కు తెలియ‌కుండానే కార్య‌క‌ర్త‌ల‌కే చాలా రూల్స్ పెడుతుండ‌డంతో వాళ్లంతా ఆమె తీరుపై మండిప‌డుతున్నారు. పార్టీలోనే కొంద‌రు ఆమెను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ఇలాగే వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్ట‌ర్ శ్రీదేవి వైఖరి మార్చుకోకుంటే నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నాయ‌కులే హెచ్చరిక‌లు జారీ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*