ఎందుకంత కాన్ఫిడెన్స్….??

ysjaganmohanreddy-confedence-on-victory

వైసీపీ అధినేత జగన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కన్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అన్న ధీమా ఆయన నడక, నడతల్లో వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమయిన జగన్ గత ఐదేళ్లుగా పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు. నేతలు చేజారిపోతున్నా ఏమాత్రం అధైర్య పడకుండా చిరునవ్వుతో ముందుకు వెళుతున్న జగన్ ఖచ్చితంగా గెలుస్తామని తనను కలసిన నేతలతో అంటున్నట్లు తెలుస్తోంది. పార్టీని వీడి వెళ్లిన నేతలు సయితం తిరిగి పార్టీలోకి వస్తామని సంకేతాలు పంపుతుండటం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

జిల్లాల్లో బలోపేతం….

గత ఎన్నికల్లో బలహీనంగా ఉన్న జిల్లాల్లో సయితం వైసీపీ బలపడిందని, ఓటు బ్యాంకు పెరిగిందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పాదయాత్రతో పార్టీకి హైప్ పెరిగిందంటున్నారు. టైట్ ఫైట్ గా ఉందని తెలిసినా అక్కడ అభ్యర్థులను మార్చాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. పూర్తిగా వన్ సైడ్ గా ఉండేలా అభ్యర్థుల ఎంపిక ఉండాలన్నది ఆయన అభిప్రాయం. అందుకే బలమైన నేతలు ఎవరు వచ్చినా బేషజాలకు పోకుండా జగన్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. పార్టీకి ఉపయోగపడతారని తెలిస్తే చాలు వెంటనే పార్టీ కండువాను కప్పేస్తున్నారు.

ఎవరు అవునన్నా…కాదన్నా….

తనను బాహాటంగా, వ్యక్తిగతంగా దూషించిన దాడి వీరభద్రరావును సయితం జగన్ ఆలింగనం చేసుకోవడాన్ని పార్టీ నేతలు సయితం ఆశ్చర్యంతో చూశారట. జగన్ లో ఇంత మార్పు తాము చూడలేదంటున్నారు. అందుకోసమే ముత్తం శెట్టి శ్రీనివాసరావు, కిల్లి కృపారాణి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, దాసరి జైరమేష్, ఆమంచి కృష్ణమోహన్, దగ్గుబాటి హితేష్ వంటి వారిని పార్టీలోకి తీసుకురావడంలో గత రెండు, మూడు నెలల నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారంటున్నారు. పాదయాత్ర సమయంలోనూ జగన్ అభ్యర్థులను ప్రకటించకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. పాదయాత్ర సమయంలో రెండు, మూడు చోట్ల తప్ప ఎక్కడా అభ్యర్థులను జగన్ ప్రకటించకపోవడాన్ని పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

చివరిక్షణంలో వచ్చినా…..

ఎవరేమనుకున్నా, కాదన్నా… గెలుపుకు ఉపయోగపడే నేతలను చివరి క్షణంలో చేర్చుకునైనా టిక్కెట్ ఇచ్చేందుకు వైసీపీ చీఫ్ రెడీ గా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అందుకే టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాతనే జగన్ తన జాబితాను విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారంటున్నారు. టిక్కెట్ దక్కని టీడీపీలో బలమైన నేతలు ఎవరైనా తనను చివరిక్షణంలో సంప్రదించినా ఓకే చెప్పేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. బంధుత్వాలు, స్నేహితాలు పూర్తిగా పక్కన పెట్టేశారు. గెలుపు గుర్రాలకే తన ప్రాధాన్యత అని జగన్ చెప్పకనే చెబుతున్నారని సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద జగన్ ఈసారి అధికారం చేజారి పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 15976 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*