జగన్ రిజర్వ్ చేసి పెట్టారా…. !!

ysjaganmohanreddy raserved seats

వైసీపీలో ఎపుడేంజరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. పార్టీ కోసం నాలుగేళ్ళుగా పనిచేస్తూ వచ్చిన ఇంఛార్జులని తప్పించారు. వారి స్థానంలో కొత్త వారికి వేశారు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరికైనా టికెట్ ఖాయం చెస్తారనుకుంటే మళ్ళీ మారుస్తారని వినిపిస్తోంది. ఈసారి ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి గాలం వేసేందుకు కొన్ని సీట్లను రిజర్వ్ చేసారని అంటున్నారు. దాంతో పార్టీలో ఎవరికి టికెట్ గ్యారంటీ లేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. విశాఖ జిల్లాలో ప్రస్తుతం వైసీపీలో గందరగోళం నెలకొనిఉంది.

హుషారేదీ…..?

ఓవైపు జగన్ పాదయాత్ర జిల్లాలో బాగా జరిగింది. మరో వైపు ఎన్నికలు రాబోతున్నాయి. అధికారం వైసీపీదేనని సర్వేలు కూడా చెబుతున్నాయి. కానీ నాయకుల్లో మాత్రం హుషారు ఎక్కడా కనిపించకపోగా అభద్రతాభావం వారిని వెంటాడుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న డాక్టర్ రమణమూర్తికి టికెట్ ష్యూర్ అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆయన్ని కోరి మరీ జగన్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు కాబట్టి. ఇపుడు సామాజిక వర్గ సమీకరణలు చూసుకుని ఆయనకి హ్యాండ్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

సీట్లు కదులుతున్నాయా…?

అలాగే, విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి కూడా ఇంచార్జి గా ఉన్న కే కే రాజుకు కూడా హ్యాండ్ ఇస్తారని అంటున్నారు. గాజువాక నుంచి టికెట్ ఖాయమనుకున్న తిప్పల నాగిరెడ్డి కి కూడా ఇపుడు సీటు కదలబోతోందని అంటున్నారు. ఆయన స్థానంలో టికెట్ ఇచ్చేందుకు ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. పెందుర్తి నుంచి పోటీ చేసేందుకు అనీ రెడీ చేసుకుంటున్న ఇంచార్జి అదీప్ రాజు కు బదులుగా కొత్త పేర్లు ఇపుడు తెరపైకి వస్తున్నాయి. అంతెందుకు విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడి టికెట్ ఇపుడు సందేహంలో పడిందని అంటున్నారు. అలాగే, అనకాపల్లి, భీమిలి నర్శీపట్నం, ఏజెన్సీ ఏరియాల్లో కూడా ఎవరికి టికెట్ ఇస్తారన్నది అసలు స్పష్టత లేదు.

దింపుడు కళ్ళెం ఆశలు…

ఓ వైపు పార్టీలో నాయకులు ఉండగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరితే వారికి టికెట్లు అన్నట్లుగా చాలా సీట్లు రిజర్వ్ చేసి పెడుతున్నారన్న ప్రచారం కూడా గట్టిగా వినిపిస్తోంది. భీమిలీ టికెట్ కోసం టీడీపీకి చెందిన ఓ ఎంపీగారికి ఉంచారని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఆ ఎంపీ ఇంతవరకూ పార్టీలోకి వస్తామని ఎక్కడా కచ్చితంగా చెప్పిన దాఖలాలు లేవు. అలాగే అనకాపల్లిలో ఇద్దరు మాజీ మంత్రులు పైనా వైసీపీకి ఆశలు పోలేదట. వారిద్దరు ఎన్నికలు అయి పార్టీ ఓడిపోయాక ఒకరి తరువాత ఒకరు పార్టీని వీడిపోయారు. ఇలా చాల చోట్ల అధినాయకత్వం ఆలోచనలు వేరేగా ఉంటూండగా ఆశలు పెట్టుకున్న ఇంచార్జుల్లో బీపీ పెరిగిపోతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*