సంచ‌ల‌నం రేపుతున్న యాత్ర.. టీజ‌ర్‌..!

yatra telugu post telugu news

రాష్ట్రంలో త‌న సంచ‌ల‌న పాల‌న‌తో రికార్డులు తిర‌గ‌రాసిన దివంగత వైఎస్ పాల‌న రాజ‌కీయాలు ఉన్న‌న్నాళ్లు చిర‌స్థాయిగా ఉండిపోనుంది. పాల‌న ప‌రంగానే కాకుండా పార్టీలోనూ ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశారు. అతి పెద్ద జాతీయ పార్టీలో అనేక మంది సీఎంలు అయ్యారు. అంద‌రూ రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే.అయితే, ఒక్క రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు మాత్రం.. చ‌రిత్ర‌లో క‌లిసిపోలేదు. చ‌రిత్రంలో నిలిచిపోయింది. అధ్యాయంగా మారిపోయింది. ప్ర‌జ‌ల గుండె గుడిలో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఆయ‌న వేసిన ప్ర‌తి అడుగు.. ఆయ‌న పాలించిన ప్ర‌తి రోజూ.. ఇప్ప‌టికీ.. ఓ రికార్డు! ఇప్ప‌టికీ.. కాంగ్రెస్‌కు ఓ పాఠం!! అలాంటి వైఎస్ ఆశ‌యాల‌కు అనుగుణంగా .. ఆయ‌న కుమారుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ముందుకు సాగుతున్నారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు.

ఇక‌, వైఎస్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న చేసిన పాదయాత్ర ఓ రికార్డుగా నిలిచిపోయింది. కాంగ్రెస్ కు ఈ పాద‌యాత్ర ప్రాణం పోసింది. వైఎస్ అంటే ఇష్ట‌ప‌డ‌నివారు సైతం.. పాద‌యాత్ర‌ను అడ్డు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి పాద‌యాత్ర‌పై ఓ మూవీ రెడీ అవుతోంది. వైఎస్ జీవిత విశేషాల స‌మాహారంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ.. చ‌ర్చ‌ల స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించింది. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి.. వైఎస్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం తాలూకు టీజ‌ర్ తాజాగా విడులైంది. కేవ‌లం 52 సెక‌న్ల నిడివితో విడుద‌లైన ఈ టీజ‌ర్ భారీ ఎత్తున షేర్ అవుతోంది. ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా యాత్రను మహి రూపొందిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించే ముందు వైఎస్సార్‌ మాటల్ని గుర్తు చేస్తూ టీజర్‌ ప్రారంభమైంది. ‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో… చరిత్రే నిర్ణయిస్తుంది’ అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో డైలాగులు వినిపించాయి. పంచెకట్టులో వైఎస్‌ను తలపిస్తూ.. అదే దరహాసం.. అదే తరహా అభివాదం ఓవరాల్‌గా మమ్ముట్టి.. లుక్‌ ఆకర్షించింది.

‘కే’ అందించిన బ్యాక్‌ గ్రౌడ్‌ స్కోర్‌ గూస్‌బమ్స్‌ తెప్పించేదిలా ఉంది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. అతిత్వరలో యాత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ కృషి చేస్తోంది. అయితే,ఈ టీజ‌ర్‌కే ఇన్ని లైకులు, షేరింగ్‌లు ల‌భిస్తుంటే.. మూవీ విడుద‌ల‌య్యాక మ‌రింత స‌న్సేష‌న్ సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి వైఎస్ ప్ర‌భంజ‌నం ఎలా ఉంటుందో మూవీ విడుద‌ల‌య్యాక చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*