వైసీపీకి ఖచ్చితంగా గెలిచే సీటు ఇదేనా?

తూర్పు గోదావ‌రి జిల్లాలో కీల‌క మైన నియోజ‌క‌వ‌ర్గం తుని. 2014లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన దాడిశెట్టి రాజా.. గెలుపొందారు. వాస్త‌వానికి పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ.. విప‌క్షానికి ప‌రిమిత‌మైంది. పైగా.. అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న చాణిక్యాన్ని మొత్తాన్నీ.. ప్ర‌ద‌ర్శిస్తూ.. విప‌క్ష ఎమ్మెల్యేల‌తో మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. దీంతో ఇక్క‌డ అభివృద్ది నామ‌మాత్రంగానే ఉంది. అయితే, అధికార పార్టీ నాయ‌కులు ఉన్న ప్రాంతాల్లో మాత్రం వాళ్లు ప్ర‌భుత్వం నుంచి నిధులు తెప్పించుకుని అక్క‌డిక‌క్క‌డ అభివృద్ధి చేస్తూ.. త‌మ పేరు చెప్పుకొంటున్నారు. ఈ ప‌రిణామం దాడిశెట్టికి కాస్త ఇబ్బందిగానే మారింది.

అంతా యనమలదే…..

అస‌లే ఇది ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నియోజ‌క‌వ‌ర్గం. దీంతో ఇక్క‌డ విప‌క్ష ఎమ్మెల్యేగా ఉన్న రాజా చెప్పిన ప‌నులు ఏ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి నామమాత్రమైంది. అంతా అధికార పక్షం కనుసన్నల్లోనే కార్యక్రమాలు సాగుతుండ టంతో ఎమ్మెల్యే పేరుకు మాత్ర‌మేనా అన్న‌ట్టుగా ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ అధికార పక్ష నేతల సూచనలతోనే అమలవుతున్నాయి. అధికార కేంద్రంగా జనం కూడా టీడీపీ నాయకులనే కలుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే పరామర్శలు, పలక రింపులకే పరిమితమయ్యారు.

యనమల చెబితేనే……

అప్పుడప్పుడు ప్రజా సమస్యల పైన, కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనలు చేపడుతున్నప్పుడు పాల్గొంటున్నారు. య‌న‌మ‌ల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం కావడంతో జిల్లా అధికార యంత్రాంగ మంతా ఆగమేఘాల మీద హాజరై అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక ఎమ్మెల్యే రాజా కూడా తన పార్టీ కార్యకర్తలతో కూడా పూర్తిగా అందుబాటులో ఉంటున్నా ప‌నులు కాక‌పోవ‌డం ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోంది. ఈలోపు టీడీపీ నేతల వ్యూహంతో ఒకొక్కరు ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నా రని చెబుతున్నారు. చాలామంది కార్యకర్తలు కూడా టీడీపీలోకి వెళ్లి పోవడంతో గ్రామాల్లో వైసీపీ నామమాత్రంగా మిగిలిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వ్యక్తిగతంగా మంచిపేరు……

ఎమ్మెల్యేకు మాత్రం వ్య‌క్తిగ‌తంగా మంచి పేరే ఉంది. కార్యకర్తలు, అభిమానులు ఎవరు పిలిచినా స్పందించ‌డం ఆయ‌న నైజం. ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకపోవడం దారుణమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా టీడీపీపై ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యేలకు రావాల్సిన నిధులను సైతం దారి మళ్లించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లకు కట్టబెట్టడంపై ఆయ‌న ఆగ్ర‌హంగా ఉన్నా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. ఇదే విష‌యాన్ని ఆయ‌న ఓపెన్‌గానే చెపుతూ టీడీపీని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

సానుభూతితో గెలుస్తారని….

అసెంబ్లీలో నియోజకవర్గం సమస్యలపై ఏడుసార్లు ప్రస్తావించి పోరాడగా ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆయ‌న చెపుతున్నారు. మొత్తంగా దాడిశెట్టి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్క‌డ య‌న‌మ‌ల ఫ్యామిలీ ఆయ‌న అనుచ‌రులు చేస్తోన్న ఆగ‌డాల వ్య‌వ‌హారం రోజు రోజుకు శృతిమించుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో య‌న‌మ‌ల‌, ఆయ‌న సోద‌రుడు ఇద్ద‌రూ ఓడారు. ఇక్క‌డ ఆరుసార్లు గెలిచిన య‌న‌మ‌ల ఇప్పుడు మంత్రిగా ఉండి కూడా వ‌చ్చే ఎన్నిల్లో పోటీ చేసేందుకు జంకుతున్నారు. ఇక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే రాజా ప‌నులు చేయ‌క‌పోయినా ఆయ‌న ప‌ట్ల ఉన్న సానుభూతి, ఆయ‌న వ్య‌క్తిత్వం, ఇటు య‌న‌మ‌ల ఫ్యామిలీపై నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న వ్య‌తిరేక‌తే మ‌ళ్లీ ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతాయ‌ని తుని పొలిటిక‌ల్ టాక్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*